ఆంధ్రా రాజధాని నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ ఆలయంలో అర్చకులు, ఈవో మధ్య సాగుతున్న వివాదం ప్రశాంతమైన ఆలయ ప్రాంగంణంలో అలజడి రేపింది. అర్చకుల పట్ల ఈవో దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు, ఆందోళనలతో గురువారం దుర్గ గుడి ప్రాంగణం భగ్గుమంది. ఓ అర్చకుడు తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యారంటూ ఈవోపై అర్చకులు భగ్గుమన్నారు. 

ఈవో నర్సింగరావుపై చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ఉదయం అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత అందరూ విధులు బహిష్కరించారు. పుజారులు లేకుండానే భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్లారు. అర్చకులంతా ఆలయ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈవో ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో విచారణకు ప్రభుత్వం నియమించిన దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్ కనకదుర్గ ఆలయానికి వచ్చారు. వెంటనే ఆయనను అర్చకులు చుట్టుముట్టి ఈవోను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రకుమార్ న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన అర్చకుడు సుబ్బారావుకు వైద్య ఖర్చులన్నీ దేవస్థానం భరిస్తుందని తెలిపారు. 

ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత చివరకు దేవాదాయశాఖ తాత్కాలిక పరిష్కారం చూపింది. మొత్తం వివాదానికి కేంద్రబిందువైన కనకదుర్గ ఆలయ ఈవో నర్శింగరావుని సెలవుపై వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయన స్థానంలో దేవాదాయశాఖ ప్రాంతీయ సంచాలకు ఆజాద్ కు బాధ్యతలు అప్పగించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: