తెలంగాణ శాసన స‌భ నేడు మూడో రోజు స‌మావేశం ప్రారంభ‌య్యాయి. స‌భ మొద‌ల‌వగానే స్పీక‌ర్ మ‌ధు సూద‌నాచారి ప్ర‌శ్నోత్తారాల‌ను చేప‌ట్టారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం పై చ‌ర్చ ప్రారంభంకానుంది. స‌భ‌లో పాల్గొన్న ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య ఉద్యోగాల భ‌ర్తీ అంశాన్ని లేవ‌నెత్తారు. లక్ష ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ఊద‌ర‌గొట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు  చేతులెత్తేసిందని ఆరోపించారు. తెలంగాణ లో నిరుద్యోగులు సుమారు 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నార‌ని తెలిపారు. అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌యినా ఇంత‌వ‌ర‌కు ఏ ఒక్క ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన దాఖలు లేవ‌ని మండిపడ్డారు. గ్రూప్ 1 నుంచి గ్రూప్-4 వ‌రకు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసి తెలంగాణ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో న‌వ యువ‌కులకు ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ బాగుప‌డ‌ట‌మే కాకుండా నిరుద్యోగ స‌మ‌స్య తీరుతుంద‌న్నారు.


అంతేకాకుండా తెలంగాణ‌లో సుమారుగా 50 వేల మంది యువ‌త డీఎస్సీ, బీఈడీ ల‌ను పూర్తి చేసి కొన్ని ఏళ్ల పాటు నిరుద్యోగులుగా ఉన్నార‌ని తెలిపారు. వెంట‌నే డీఎస్సీ ప్ర‌క్రియను పూర్తి చేసి 50 వేల‌ టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని సూచించారు. దీనికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ స‌మాదాన‌మిస్తూ రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో లక్షా 7 వేల 744 ఖాళీలున్నాయ‌ని చెప్పారు. ఖాళీల భ‌ర్తీ కి సంబంధించి అన్ని  డిపార్ట్ మెంట్ల‌ను సంప్ర‌దించ‌గా 56 వేల 150 పోస్టులు భ‌ర్తీకి ప్ర‌తిపాద‌న‌లు అందాయ‌ని చెప్పారు. వాటిలో 18 వేల 423 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసిన‌ట్టు తెలిపారు. తెలంగాణ ఉద్య‌మ ప్ర‌స్థాన‌మే నీళ్లు, నిధులు, నియామ‌కాల కోస‌మ‌ని మంత్రి ఈటెల అన్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రంలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: