ప్రస్తుతం మన దేశానికి కాలుష్య ముప్పు పొంచి ఉంది. కాలుష్య కోరల్లో చిక్కుకొన్న మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది. అందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకప్పుడు సైకిళ్లు, సైకిల్ రిక్షాలకు పేరొందిన హైదరాబాద్ నగరం మరోసారి సైకిళ్ల బాట పడుతోంది. నగరంలో వంద సైకిల్ కేంద్రాలను ఏర్పాటు చేసి పదివేల సైకిళ్లను పౌరులకు అందుబాటులోకి తీసుకరవడానికి హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ ప్రణాళిక రూపొందించింది.

 

మెట్రో స్టేషన్లకు సైకిళ్ల మీద వెళ్లడం, స్టేషన్ నుండి నగరంలో ఏ ప్రాంతానికైనా వీటిని తీసుకెళ్లడానికి వీలుగా కార్యాచరణ రూపొందించారు. దీనివల్ల కాలుష్యం తగ్గడానికి వీలు పడుతుందని ఆరోగ్యానికి కూడా మంచిదని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలో వాహనాల సంఖ్యతో పాటు కాలుష్యం తీవ్రత దారుణంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. మొదటి దశ క్రింద ఔటర్ రిండ్ రోడ్ దగ్గర 25 కిలోమీటర్ల సైకిల్ మార్గాలు నిర్మించాలని నిర్ణయించింది.

 

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు సంస్థ సహకారంతో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ 63 మెట్రోరైలు స్టేషన్ల దగ్గర,37 రద్దీ ప్రాంతాల్లో సైకిల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాల్లో 10,000 సైకిళ్లను అందుబాటులో ఉంచుతుంది. వీటిలో వృద్ధులు, దివ్యాన్గుల కోసం 2500 కాలుష్య కారకం కాని ఈ-బైక్ లు ఉంటాయి. ఇవి బ్యాటరీలతో నడుస్తాయి. మెట్రో స్టేషన్లో దిగినవాళ్ళు అక్కడ సైకిల్ తీసుకొని ఇంటికి చేరుకోవచ్చు. ఇంటికి దగ్గరలోని సైకిల్ కేంద్రాల్లో దాన్ని అప్పగించేయవచ్చు. అలాగే పని మీద ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ దగ్గరలోని కేంద్రంలో సైకిల్ తీసుకొని స్టేషన్ కి వెళ్లి అక్కడ దాన్ని అప్పగించేసి రైలెక్కి వెళ్లిపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: