ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడు అయిన కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజి శాఖ సహాయ మంత్రి వైఎస్‌ సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మారిషస్‌ బ్యాంకుకు రూ. 106 కోట్ల రుణం ఎగవేత కేసులో గత కొంత కాలంగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి కేసు విచారణలో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంతో నాంపల్లి 12 వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గురువారం అరెస్టుకు ఉత్తర్వులు ఇచ్చారు.

సుజనా యూనివర్సల్‌ ఇండసీ్ట్రస్‌ తమ బ్యాంకు నుంచి రూ.106 కోట్ల రుణం తీసుకొని చెల్లించలేదంటూ మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు కేంద్ర మంత్రి సుజనా చౌదరితోపాటు మరికొందరిపై కొద్ది రోజుల క్రితం నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. మారిషస్‌ బ్యాంకుకు రుణం చెల్లింపుకు సంబంధించిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టుకు స్వయంగా హాజరుకావాలని కోర్టు మూడుసార్లు సుజనా చౌదరికి సమన్లు జారీ చేసింది.

ఈ సమన్లను పట్టించుకోకుండా కోర్టుకు హాజరుకాకపోవడాన్ని ధిక్కారంగా భావించిన న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26 కి వాయిదా వేసింది. ఈ విషయంపై సుజనా స్పందిస్తూ.. పనుల ఒత్తిడి వల్లే తాను గతంలో కోర్టు వాయిదాలకు హాజరుకాలేకపోయానని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: