తెలంగాణలో తెలుగు దేశం పార్టీ వలసలతో బలహీనమైపోయింది. చివరకు ఆ పార్టీ తరపున కేవలం ముగ్గురే ఎమ్మెల్యేలు మిగిలిపోయిన దుస్థితి. దాని ప్రభావం ఆ పార్టీ నాయకులపైనా పడుతోంది. ముఖ్యంగా ఆ పార్టీలో బిగ్ వాయిస్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా  కొద్దికాలంగా సైలంట్ గా ఉంటున్నారు. ఏమైనా పార్టీ ప్రెస్ మీట్లు ఉంటే.. రావుల వంటి నాయకులే చూసుకుంటున్నారు. 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా రేవంత్ రెడ్డిలో మునుపటి చురుకుదనం కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయన మరోసారి తన వాయిస్ బలంగా వినిపించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలతో కలసి పాల్గొన్నారు. కేసీఆర్ కేబినెట్లో ఇప్పటి వరకూ స్త్రీలకూ, మాల మాదిగలకు చోటు లేని సంగతి తెలిసిందే. 

ఈసారైనా దళితులను, మహిళలను పట్టించుకుంటారా..?


కేసీఆర్ కేబినెట్లో రాజయ్య ఉద్వాసన తర్వాత మాల, మాదిగల్లో ఎవరికీ మంత్రిపదవి లేదు. ఆ స్థానంలో తీసుకున్న కడియం శ్రీహరి టెక్నికల్ గా ఎస్సీ అయినా ఆయన మాల, మాదిగ వర్గాలకు చెందినవారు కాదు. రెల్లి సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పటికే అనేక సార్లు ఈ అంశంపై కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితులకే ముఖ్యమంత్రి పదవి అన్నవారు.. చివరకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి. 

అంబేద్కర్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. జూన్ రెండు లోపు కేబినేట్ లోకి దళితులు, మహిళలకు చోటు ఇవ్వకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మోత్కుపల్లి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర , దీక్షలో ఎల్.రమణ, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..దళితులకు తెలంగాణలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మరి రేవంత్ డిమాండ్ పై కేసీఆర్ ఏం చేస్తారో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: