పవన్ కల్యాణ్.. మాకు ఫ్లాప్ అయినా సరే సర్దార్ గబ్బర్ సింగే కావాలి.. సర్దార్ బెగ్గర్ సింగ్ లా ఉండొద్దు.. ఇదీ ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినీనటుడు కమ్ పొలిటీషియన్ పవన్ కల్యాణ్ పై పేల్చిన ట్వీట్ బాంబు.. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. జనం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే వరకూ పరిస్థితి తెచ్చుకోవద్దని కేంద్రానికి పవన్ విజ్ఞప్తి చేయాడాన్ని విమర్శిస్తూ వర్మ అలా సెటైర్ పేల్చాడు. 

కానీ ఈ ట్వీట్ ను గమనిస్తే.. ఇది పవన్ కల్యాణ్ కంటే ఏపీ సీఎం చంద్రబాబుకైతే ఇంకా బాగా సూటవుతుందేమో అనిపించకమానదు. ఎందుకంటే.. ఆంధ్రా రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని అన్నివర్గాలూ ముక్తకంఠంతో అంటున్నాయి. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. ఈ విషయంలో ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ హామీలు ఇచ్చి ఉన్నాయి. 

ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ కూడా తిరుపతి సదస్సులో వాగ్దానం చేశాడు. అందులోనూ కేంద్రం తలచకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నది అసాధ్యమైన పని ఏమాత్రం కాదు. ఇలాంటి ఏకాభిప్రాయం ఉన్న అంశంలోనూ చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికీ హోదా సాధిస్తారన్న నమ్మకమేమీకనిపించడం లేదు. 

కనీసం హోదా ఇవ్వని బీజేపీకి కనీస స్థాయి నిరసన కూడా తెలపడం లేదు. కేంద్రమంత్రివర్గంలోని టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం, మోడీకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, డిల్లీలో ధర్నాలు చేయడం వంటి చర్యల ద్వారా బీజేపీపై ఒత్తిడి తీసుకురావచ్చు. కానీ అలాంటి ఆలోచన చంద్రబాబుకు ఉన్నట్టు ఏమాత్రం కనిపించదు. 

ఇప్పటికీ ఆయన చేస్తున్న పని ఒక్కటే. అది కేంద్రానికి విజ్ఞప్తి చేయడం.. తప్పకుండా మళ్లీ విజ్ఞప్తి చేస్తాం.. వాళ్లు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా విజ్ఞప్తి మాత్రం చేస్తాం.. ఇప్పటికే ఓ పాతిక సార్లు అడిగాం.. ఇచ్చేవరకూ అడుగుతూనే ఉంటాం.. అని చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నాడంటే.. ఆయన్ను సర్దార్ బెగ్గర్ సింగ్ అని కామెంట్ చేయడంలో వింతేముంది..వింత కాదు.. ఈ కామెంట్ కు సరైన అర్హత ఉన్నది చంద్రబాబుకే అన్నది కొందరి అభిప్రాయం.. కాదంటారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: