ఒంగోలు గిత్త.. ఆంధ్రా ప్రత్యేకతల్లో ఒకటి. నాణ్యమైన ఈ మేలుజాతి గిత్తల ఖ్యాతి విశ్వవ్యాప్తమైన సంగతి తెలిసిందే. అంతరించేపోతున్న ఈ ఒంగోలు జాతి గిత్తలను బ్రెజిల్ వంటి దేశాలు ఆదరిస్తూ తమ దేశంలో పెంచుకుంటున్నాయి. ఇప్పుడు అదే ఒంగోలు గిత్తల సత్తాను ప్రపంచానికి వివరిస్తున్నారు ఆంధ్రా స్పీకర్ కోడెల శివప్రసాదరావు.  

ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్న కోడెల.. అక్కడ వివిధ వేదిక‌ల‌పై ఆయన ప్రసంగించారు. దేశీయ సంత‌తికి చెందిన ఒంగోలు జాతితో స‌హ ప‌లు ప‌శు జాతుల స‌మాహారంగా బ్రెజిల్‌లో రూపాంత‌రం చెందిన జేబు జాతి ఎద్దుకు సంబంధించిన వీర్యాన్ని భార‌త్‌కు అందించ‌టం ద్వారా ప‌ర‌స్పర  స‌హ‌కారాన్ని వేగ‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కోడెల ఆకాంక్షించారు. సుస్ధిర సాగు, ప‌శుపోష‌ణ‌పై బ్రెజిల్‌లో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ స్టడీ టూర్‌లో కోడెల పాల్గొన్నారు. 

బ్రెజిల్ లో ఒంగోలు గిత్తకు భలే ఆదరణ.. 


భార‌త్‌కు చెందిన ఒంగోలు జాతిని సైతం ప‌టిష్టమైన జాతిగా తీర్చిదిద్దేందుకు అంత‌ర్జాతీయ స్ధాయి స‌హ‌కారం తీసుకుంటామ‌ని ఆదిశ‌గా త‌మ ప్రభుత్వాలు చ‌ర్యలు తీసుకుంటున్నాయ‌ని వివ‌రించారు.  త‌మ ప‌రంగా భార‌త్‌కు సహాయ స‌హ‌కారాలు అందించేందుకు తాము  ఎప్పుడూ సిద్దంగానే ఉంటామ‌ని బ్రెజిల్‌లో ఎబిసిజెడ్ అధ్యక్షుడు క్లాడియో స‌భాప‌తికి హామీ ఇచ్చారు. 

జేబు జాతిని భార‌త్‌లో అభివృద్ధి చేసేందుకు అవ‌స‌ర‌మైన వీర్యాన్ని అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని, జ‌న్యుప‌రంగా మెరుగైన పశుసంత‌తిని ఇండియాకు అందిస్తామ‌ని క్లాడియా పేర్కొన్నారు. బ్రెజిల్‌లో భార‌త రాయ‌బారి సునీల్‌లాల్‌, భార‌త్‌లో బ్రెజిల్ రాయ‌బారి బ‌ర్రోస్ గోమ్స్‌లు ఈ విష‌యాల‌పై చ‌ర్చించి ఆమోద‌యోగ్యమైన రీతిలో ప‌ర‌స్పర జంతు జాతుల బ‌దిలీకి మార్గం సుగ‌మం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా స్పీకర్ కోడెల అభిల‌షించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: