రాజ్యసభలోకి వచ్చీరాగానే  కాంగ్రెస్ ను ఒక ఆట ఆడుకుంటున్న  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా  తన దాడిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  గవర్నర్ రఘురామ రాజన్ పై  ఎక్కుపెట్టారు. ఆయన తప్పుడు విధానాలవల్లే దేశంలో  నిరుద్యోగం పెరుగుదలకు దారితీసిందని ఆరోపించారు.  ప్రభుత్వం  తక్షణమే అతణ్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రఘురామ రాజన్ మనదేశానికి అనుకూలుడు కాదనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన  ఫైర్ బ్రాండ్ స్వామి   ఆర్బీఐ గవర్నర్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై మండిపడ్డారు.


రాజన్ తీసుకుంటున్న చర్యల  మూలంగా  ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని స్వామి విమర్శించారు.  వడ్డీరేట్లు పెంచాలనే యోచన సరైంది కాదని,  ఆ ఫలితాన్ని దేశం అనుభవిస్తోందని పేర్కొన్నారు.   రాజన్ కు  సెలవిచ్చి, ఎంత తొందరగా చికాగో పంపిస్తే అంత మంచిదంటూ స్వామి  తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

అవసరం లేకపోయినా సహాయం కావాలంటూ అనవసర ఏడుపులు ఏడవడం వల్ల భారతీయ బ్యాంకులపై విశ్వసనీయత తగ్గుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆయన, ఇండియాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్దఎత్తున పుట్టుకు వస్తుండటం శుభపరిణామమని, వాటి వల్ల ఉద్యోగ సృష్టి పెరుగుతోందని అన్నారు. కేంబ్రిడ్జ్ వర్శిటీలో 'వై బ్యాంక్స్' అంశంపై ఆయన ప్రసంగించారు.

 

గతంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గా కూడా విధులు నిర్వహించిన రాజన్, తమ వద్ద మూలధనం నిల్వలను కరిగించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉన్నదని, ఆర్థికమాంద్యం నుంచి పూర్తి స్థాయిలో గట్టెక్కాలంటే తప్పనిసరని అన్నారు. రుణాల మంజూరులో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే ఎటువంటి ఎగవేతలూ ఉండవని అభిప్రాయపడ్డ ఆయన, రుణ మంజూరులో ఉన్న రిస్క్ ను బ్యాంకులు గణనీయంగా తగ్గించుకోవాల్సి వుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: