దేశంలోని మినీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ దాదాపుగా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాతంలో శాస‌న స‌భ్య ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌రిసమాప్త‌మైంది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరిల్లో ఎన్నిక‌ల ప్రచారం ముగిసి నేడు పోలింగ్ జ‌రుగుతోంది. నాలుగు రాష్ట్రాల్లోకి అసోం లో రెండు విడ‌త‌ల పోలింగ్  ఏప్రిల్ 11న ముగియ‌గా... పశ్చిమ బెంగాల్ లో  ఆరు విడ‌త‌ల పోలింగ్ ఈ నెల 5 న ముగిసింది. ఈ సార్వ‌త్రిక ఎన్నికలు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కి అగ్ని ప‌రీక్ష‌గా నిలుస్తున్నాయి. నరేంద్ర‌మోడీ , బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఈ రాష్ట్రాల‌లో ప్ర‌చారం బాధ్య‌త‌ను త‌మ భుజాల‌పై మోశారు. కేంద్ర మంత్రులు, పార్టీ నేత‌లు ప్ర‌చారం సాగించినా వారిపై బాధ్య‌త ఉండ‌దు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ త‌న ప్ర‌భుత్వ విజ‌యాల గురించి ప్ర‌చారం చేసుకుంటూనే అక్క‌డి అధికార ప‌క్షాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. అయితే, కేర‌ళ లో ఒక చోట మోడీ చేసిన వ్యాఖ్య వివాదానికి దారి తీసింది. కేర‌ళ లోని ఆదివాసుల స‌మ‌స్య గురించి ప్ర‌స్తావించిన న‌రేంద్ర‌మోడీ ఆ రాష్ట్రాన్ని సోమాలియా తో పోల్చారు. ఈ సారూప్య‌త‌ను కేర‌ళ ముఖ్య‌మంత్రి ఊమెన్ చాందీనే కాకుండా ప‌లువురు నెటిజ‌న్ లు కూడా విమ‌ర్శించారు.


కేర‌ళ లో బోణి కొట్టెందుకు బీజేపీ య‌త్రం...
 
న‌రేంద్ర‌మోడీ ఈ వ్యాఖ్య‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ప‌రువు న‌ష్టం దావా వేస్తామంటూ చాందీ బెదిరించారు కూడా. అయితే.... కేర‌ళ కు చెందిన బీజేపీ  ఎస్టీ నాయ‌కురాలు ఒక‌రు మోడీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్దించారు. ఆమె కొన్ని ఉదాహర‌ణ‌లు కూడా చూపారు. మోడీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించారు. ఆమె కొన్ని ఉదాహర‌ణ‌లు కూడా చూపారు మోడీ ఇంత  ముందు ఆసోం లో కూడా చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఆ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి త‌రుణ్ గొగోయ్ కూడా ఆక్షేపించారు. ఉత్త‌రాది రాష్ట్రాల‌లో మాదిరిగానే కేర‌ళ, త‌మిళ‌నాడుల‌లో కాంగ్రెస్ నుంచి పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ ప్ర‌చార స‌భ‌ల‌లో ప్ర‌సంగించారు. 16 న పోలింగ్ జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల‌లో దేనిలోనూ బీజేపీ కి పెద్ద‌గా బ‌లం లేదు. కేర‌ళ‌లో అధికార యుడిఏఫ్, ప్ర‌తిపక్ష ఎల్డీఎఫ్ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉన్న‌ది. ఇప్పుడు వాటికి గ‌ట్టిపోటే ఇచ్చి శాస‌నస‌భ‌లోకి అడుగుపెట్టేందుకు బీజేపీ బ‌ల‌మైన వ్యూహంతో ముందుకు సాగింది. అంటే కేర‌ళ లో ముక్కోణ‌పు పోటీ జ‌రిగింది.యుడీఏఫ్ , ఎల్డీఎఫ్ అసెంబ్లీ లోని మొత్తం 140 సీట్ల‌కూ పోటీ చేశాయి. ఇంత వ‌ర‌కు కేర‌ళ లో లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇంత వ‌ర‌కు ఒక్క స్థానం కూడా గెలుచుకోని బీజేపీ ఈ సారి రాష్ట్రంలో ఏ విధంగానైనా త‌న ప్ర‌భావం చూపాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది .


ఉక్కిరి బిక్కిరి అవుతున్న ముఖ్య‌మంత్రి ఊమెన్ చాంధీ.....


ఈ రెండు ఫ్రంట్ ల నుండి ముఖ్యంగా ఎల్డీఎఫ్ నుంచి హిందూ వోట్ల ను కొల్ల గొట్ట‌డం ద్వారా అసెంబ్లీలోకి అడుగిడాల‌ని బీజేపీ కృషి చేసింది. అయితే.... కేర‌ళ లో ఒక అన‌వాయితీ సాగుతోంది. పాల‌న‌లో ఉన్న ఫ్రంట్ ఏదీ తుద‌పరి ఎన్నిక‌ల్లో  అధికారాన్ని నిల‌బెట్టుకోలేక‌పోతున్న‌ది. ఆ అన‌వాయితీని త‌ప్పించాల‌నేది యూడీఎఫ్  కృత నిశ్చ‌యంగా ఉన్న‌ది కానీ, త‌న ప్ర‌భుత్వం పై వ‌చ్చిన ప‌లు కుంభ‌కోణాల ఆరోప‌ణ‌లతో ఉక్కిరిబిక్కిరి అవుత‌న్న ముఖ్య‌మంత్రి ఊమెన్ చాందీకి ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌డం క‌ష్ట‌మే కావ‌చ్చు. 2011 ఎన్నిక‌ల్లో యూడీఏఫ్ కేవ‌లం నాలుగు సీట్ల ఆధిక్యంతో అంటే, పోటా పోటీ మెజారిటీ తో అధికారంలోకి వ‌చ్చింది. అసోం లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఆంశం ఆధారంగా అధికార పీఠం పై క‌న్ను వేసిన బీజేపీ ప‌శ్చిమ బెంగాల్ లో కొద్దో గొప్పో సీట్ల‌ను గెలుచుకోగ‌ల‌మనే ఆశ పెట్టుకున్న‌ది. అధికార తృణ‌మాల్ కాంగ్రెస్ తో స‌హా అన్ని పార్టీలు త‌మ‌దైన రీతిలో ప్రచారం సాగించాయి. మాట‌ల తూటాలు పేలాయి. త‌మిళ‌నాడు లో రెండు ప్రదాన ప‌క్షాలు అధికార ఎఐడీఎంకే, ప్ర‌తి ప‌క్ష డీఎంకే పోటాపోటీ గా ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ ల పంపిణీ మొద‌లైన వ‌రాలు ప్ర‌క‌టించాయి.


సీఎం కుర్చి పై కరుణానిధి క‌న్నేశారు.....

ఎఐఎండీఎంకే 227 సీట్ల‌కు  పోటీ చేస్తుండ‌గా... త‌క్కిన  ఏడు సీట్ల‌ను త‌మ‌తో జ‌ట్టు క‌ట్టిన  చిన్న పార్టీల‌కు జ‌య‌ల‌లిత వ‌దిలారు. ఇక డీఎంకే , కాంగ్రెస్, తదిత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకున్న‌ది. 90 ఏళ్లు దాటిన డీఎంకే అధినేత ఎం క‌రుణానిధి ఇంకా సీఎం ప‌ద‌వి పై క‌న్ను వేశారు. ఆయ‌న తిరువారూర్ నుంచి పోటీ చేస్తున్నారు. త‌ను లేక‌పోతే తన వారసుడు ఎంకే స్టాలిన్ అని కూడా క‌రుణానిధి ప్ర‌క‌టించారు. ఇందుకు ఆయ‌న పెద్ద కుమారుడు ఎంకే అళ‌గిరి అలిగి పార్టీ ప్ర‌చారానికి పూర్తిగా దూర‌మ‌య్యారు. త‌మ పార్టీకి తాను ఓటు వేయ‌బోన‌ని కూడా అళ‌గిరి చెప్పారు. అయితే... డీఎంకే అభ్య‌ర్థులు కొంత మంది పై పార్టీ శ్రేణుల్లో నిర‌స‌న వ్య‌క్త‌మైంది. పార్టీ గెలుపు  కోసం పాటు ప‌డాలని క‌రుణానిధి చేసిన విజ్ఞ‌ప్తి ఆ శ్రేణులు పట్టించుకోలేదు. మ‌రి అక్క‌డ ఫ‌లితాలు ఎలా వస్తాయా? 65 సీట్ల‌కు ప‌ట్టుబ‌ట్టి చివ‌ర‌కు 41 సీట్ల‌కు ఒప్పుకున్న కాంగ్రెస్ ప‌ట్టుద‌ల‌తోనే పోటీ చేసింది. ఆ రెండు కూటముల‌కు పోటీగా బ‌రిలో విజ‌య‌కాంత్ (డీఎండీకే) నేతృత్వంలోని 3 వ ఫ్రంట్ కూడా నిలిచింది.  బీజేపీ ఆసోం పై చాలా ఆశ‌లు పెట్టుకుంది. విజ‌యం సాధిస్తామ‌నే ధీమా తో పార్టీ ఉంది. అందుకే తన పాత విధానాన్ని కాద‌ని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని కూడా పార్టీ ప్ర‌క‌టించింది.  


కాంగ్రెస్ కు చావో రేవో తేల్చుకునే ప‌రిస్తితే....


2011  వ‌ర‌కు అసోం గ‌ణ ప‌రిష‌త్ తో జ‌తక‌ట్టిన కేంద్ర మంత్రి శ‌ర్వానంద సోనోవాల్ ను సీఎం అభ్య‌ర్థిగా బీజేపీ పేర్కొంది. ఒపీనియ‌న్ పోల్స్ కూడా బీజేపీ కి అసోం లో అధికారం ద‌క్క‌వచ్చ‌ని సూచించాయి. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల‌లో కూడా త‌న ప‌రిస్థితిని కొంత మెరుగు ప‌ర‌చుకోవ‌చ్చ‌ని బీజేపీ ఆశిస్తోంది. అయితే.... కాంగ్రెస్ కు ఈ అన్ని రాష్ట్రా ల‌లో చావో రేవో తేల్చుకునే ప‌రిస్థితి నెల‌కొంది అసోంలో కాంగ్రెస్ పార్టీ గ‌త 15 సంవ‌త్స‌రాలుగా నిరాటంకంగా పాలిస్తోంది. కేర‌ళలో కూడా అధికారంలో  ఉన్న యూడీఎఫ్ కు కాంగ్రెస్ సార‌థ్యం వ‌హిస్తోంది. అస్సాం, కేర‌ళ ల్లో క‌నుక కాంగ్రెస్ తిరిగి అధికారం నిల‌బెట్టుకోగ‌లిగితే అది పార్టీ కి మంచి ఊపు ఇస్తుంది. అలా కాకుండా ఓట‌మి చ‌వి చూస్తే మాత్రం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బే అవుతుంది. 2014 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసిన  త‌రువాత  హర్యానా, మ‌హారాష్ట్రలో కూడా పార్టీ ఓట‌మి పొందింది. ఢిల్లీలో కూడా ఆ పార్టీ ప‌రిస్థితేమీ మార‌లేదు. బీహార్ లోనే కొద్దిగా మెరుగు ప‌డింది. అక్క‌డ గెలుపు గుర్ర‌మైన జ‌న‌తా ద‌ళ్ (యు), రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ లు నేతృత్వంలోని కూట‌మి లో భాగ‌స్వామిగా ఉంది.
ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్దం లో ఉత్త‌ర ప్ర‌దేశ్ తో స‌హా కొన్ని రాష్ట్రాల‌లో కూడా శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కీల‌క‌మైన యూపీ పై బీజేపీ  ఇప్ప‌టికే క‌న్ను వేసింది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగిన రాష్ట్రాల‌లో బీజేపీ, ప్ర‌ధానంగా మోడీ చూపే ప్ర‌భావం పై యూపీ లో ఆ పార్టీ భ‌విష్య‌త్తు  ఆధార‌ప‌డి ఉంది. అయితే గత బీహార్ ఎన్నిక‌ల్లో మోడీ కి కొద్ది పాటి  ప్ర‌భావ‌మే చూపింది కానీ, ఈ సారి మినీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు మాత్రం ఎన్డీఏ కు అగ్ని పరీక్ష గానే చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: