బాక్సింగ్ చాంపియన్ గ్రేట్ మహ్మద్ అలీ (74) ఇకలేరు. మహమ్మద్ అలీ విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. తర్వాత  ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. ఇతని కూతురు లైలా అలీ కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ఇతను కొన్ని చిత్రాలలో కూడా నటించాడు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు.శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం మరణించారు.

1942 జనవరి 17న కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ జన్మించారు. 12 ఏళ్లకే బాక్సింగ్ను కెరీర్గా ఎంచుకున్న ఆయన 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయ్యారు. 1960ల్లో ఆయన బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించారు. 20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మన్గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సింగ్ ప్రపంచంలో తనకు ఎదురే లేదు అనిపించారు.  

అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యారు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించారు. అలీ నాలుగు వివాహాలు చేసుకున్నారు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: