మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీల మధ్య కొంతకాలంగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇక డైరెక్టు వార్ గా మారింది. ఇన్నాళ్లూ విమర్శలతో గడిపేసిన నేతలు ఇప్పుడు చేతులు చేతులు కలిపి కొట్టుకునేదాకా వచ్చారు. విజయవాడలో రోడ్ల విస్తరణలో భాగంగా గోశాల, ప్రార్థనాలయాల తొలగింపు వ్యవహారం ఈ రెండు పార్టీల విబేధాలను తారస్థాయికి చేర్చింది. 

కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా నగరంలో కృష్ణానది వెంట ఉన్న ఆలయాల్ని అధికారులు తొలగిస్తున్నారు. ఇంద్రకీలాద్రి వద్ద అర్జున వీధిలో ఉన్న గోశాలను సైతం తీసివేశారు. దీనిపై బిజెపి నగర పార్టీ ఆధ్వర్యంలో కన్నాలక్ష్మినారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. నిర్మాణాలు తొలగించిన ప్రాంతాల్ని సందర్శించారు. 


గోశాల వద్దకు కూడా వచ్చారు. అర్జన వీధిని 100 అడుగల మేరకు విస్తరించటంలో భాగంగా ఒకవైపున ఉన్న నిర్మాణాల్ని మాత్రమే తొలగించటం సరికాదని కన్నా వ్యాఖ్యానించారు. అవతలి వైపున కొందరు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాల్ని తొలగించటం లేదేంటని ప్రశ్నించారు. దీనిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

టీడీపీ నాయకులు బీజేపీ నేతలవైపు దూసుకెళ్లడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఇరువర్గాలు పెద్దపెద్దగా కేకలు వేసుకున్నాయి. పరిస్థితి చెయ్యిదాటిపోతోందని గమనించిన పోలీసులు రెండు వర్గాలను శాంతింపచేసి అక్కడ్నుంచి పంపేశారు. మీ సంగతి తేలుస్తాం. ఇక్కడికి రావడానికి మీరెవరంటూ టీడీపీ నేతలు కమలనాథులకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: