హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించడానికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నాటిన మొక్కను బతికించి, పెద్దచేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించాలని ఆయన చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.



రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న హరితహారం కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలంతా ఇందులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘హరితహారం కింద పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. వాటిని కాపాడే విషయంలోనూ అంతే శ్రద్ధగా వ్యవహరించాలి. కలెక్టర్లతో సీఎస్ సమన్వయం చేసుకుని రాష్ట్రవ్యాప్త కార్యాచరణ తయారు చేయాలి. ప్రతి ప్రభుత్వ శాఖ పరిధిలో నాటుతున్న మొక్కలకు నీళ్లు పోయడం, రక్షించడం కూడా సంబంధిత అధికారులే తీసుకోవాలి..’’ అని సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో హరితహారాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కార్యాచరణ రూపొందించి అమలు చేయడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు.



వర్షాలు కురవని రోజుల్లో మొక్కలకు ఏవిధంగా నీరు అందించాలనే విషయమై కార్యాచరణ రూపొందించుకోవాలి. సదరు కార్యాచరణ ప్రణాళికను ఆటవీశాఖ ముఖ్యకార్యదర్శికి పం పాలి. ప్రతి వారానికి ఒకసారి నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తాను అని కలెక్టర్లకు పంపిన మోమోలో సీఎస్ పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాదు... వాటిని బతికించడం చాలా ముఖ్యం.. అన్ని జిల్లాలు, డివిజన్లలో అందుబాటులో ఉన్న ఫైర్‌ఇంజన్లను మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో ఉన్న మంచినీటి ట్యాంకర్లను కూడా ఉపయోగించి మొక్కలకు నీరుపోయాలి అని ఆ మె మోలో వివరించారు. పోలీస్‌శాఖ కూడా మొక్కలను బతికించడం కోసం వర్షాలు లేని సమయంలో నీళ్లు పోయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని డీజీపీని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: