ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి ఎందుకంత చులకన? విభజన చట్టంలోని హామీల అమలు మొదలు కొని ప్రత్యేక హోదా, ఆర్ధిక లోటు భర్తీ, పోలవరం నిర్మాణం ఇలా అన్నింటా కేంద్రం ఎందుకింత వివక్ష చూపుతోంది? ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు? ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని తమిళనాడుపై అమిత ప్రేమ చూపి కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్రకటించే ఎన్డీఏ సర్కార్ కు.. ఆంధ్రప్రదేశ్ విభజన కష్టాలు కనిపించడం లేదా? సాయం చేసేందుకు మనసు ఎందుకు రావడం లేదు? తెలుగు ప్రజలు అంత కాని వారయ్యారా! లేక ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కేంద్రం ఆడించినట్లు ఆడుతున్నందుకా? అనే వాదన అక్కడి ప్రజల నోటి వెంట వినిపిస్తోంది. 

Image result for andhrapradesh

రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చినా.. దానిని అమలు చేసేందుకు కేంద్రం రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తోంది. నాడు ఏపీకి ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని సభలో పోరాడిన బీజేపి.. అధికారంలోకి వచ్చాక కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటోంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలుపుతున్నా మౌనం వహిస్తోంది. ఇదిగో అదుగో అంటూ తాత్సారం చేస్తోంది. ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. 

Image result for telangana

ప్రత్యేక హోదా సంగతి అటుంచితే.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలవాల్సిన కేంద్రం.. అన్నింటా కోతలు విధిస్తోంది. విభజన హామీల అమలులో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం.. మెల్లగా తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో భూసేకరణ, ప్రధాన ప్రాజెక్టు పనులు, కాంక్రీట్‌ పనుల నిధులను కేంద్రమే భరించాలి. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు నామమాత్రపు నిధులే కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర చిత్తశుద్ధిపై విమర్శలు వినిపిస్తున్నాయి. అథారిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుపై పెత్తనం చేస్తోందే తప్ప.. కొత్తగా చేసిందేమీ లేదు.  ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ వంటి నిర్మాణాల డిజైన్లకు కేంద్ర జల సంఘంతో ఆమోద ముద్ర వేయించడంలోనూ విఫలమైందనే చెప్పాలి.

Image result for ap special status

జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు తామే పూర్తిగా నిధులు భరించాల్సి ఉండగా కేంద్రం కొత్తమెలిక పెట్టింది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను నాబార్డు రుణంగా అందిస్తామని చెప్పి.. ఇప్పుడు కండీషన్స్ అప్లై అంటోంది. నాబార్డు రుణంలోనూ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ 'ఎఫ్‌ఆర్‌బీఎం' కి లోబడే అంటూ కొత్త పల్లవందుకుంది. ఇలా చేస్తే.. తీసుకున్న రుణం వడ్డీతో సహా తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. 

Image result for polavaram

కేంద్రం కొత్త మెలికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి భారంగా మారుతుందని, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి రుణం తీసుకోవాలంటే కేంద్రం అనుమతి ఎందుకని ప్రశ్నిస్తోంది. పోలవరానికి జాతీయ హోదా కల్పించినందువల్ల.. మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని, మధ్యలో ఈ రుణం ప్రతిపాదన ఏంటని ఇటీవల పోలవరంపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

Image result for chandrababu

ఆంధ్రప్రదేశ్ కు నిధుల కేటాయింపు విభజన హామీల అమలు పట్ల కేంద్రం తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు సూటిగానే తప్పుపట్టారు. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు బిల్లు సందర్భంగా పెద్దల సభలో అరుణ్ జైట్లీ ప్రసంగం తమను నిరాశ పరిచిందని బహిరంగంగానే ప్రకటించారు. ఒకానొక దశలో కేంద్రం నుంచి బయటకు రావాలనే వాదన తెలుగుదేశం పార్టీలోనూ వినిపించింది. అయితే కేంద్రంతో కలిసుంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేయడంతో ఆ ప్రతిపాదన మరుగునపడింది. ఏది ఏమైనా.. విభజన హామీల అమలుకు టీడీపీ సర్కార్, కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందా..? లేక  కేంద్రమే ఇచ్చిన హామీలను అమలు చేసి ఆంధ్రులపై తమకు చులకన భావం లేదనే అపవాదును కడిగేసుకుంటుందా.. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: