టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కోర్టులు కలిసొస్తున్నాయి. ఆయన అదృష్టమో..  లేక సుడో తెలియదు కానీ.. ఆయనపై ఆరోపణలు వినిపించిన కేసుల్లో.. 'స్టే' లు పొందగలుగుతున్నారు. ఇప్పటి వరకు 16 కేసుల్లో కోర్టుల నుండి స్టే లు సంపాదించిన చంద్రబాబు.. తాజాగా ఓటుకు నోటు కేసులోనూ తన అదృష్టాన్ని నిరూపించుకున్నారు. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టులో వూరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు "8వారాల స్టే" విధించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.


ఓటుకు నోటు కేసును పునర్విచారించి సెప్టెంబర్ 29లోగా సమగ్ర నివేదిక అందించాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుల చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఆగస్టు 31న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.  ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసులో పునర్విచారణ అవసరం ఏముందని క్వాష్ పిటిషన్‌లో ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుని పునర్విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కేవలం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పిటిషన్ దాఖలైందని సదరు పిటిషన్‌లో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్.. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 


సుమారు 10నెలలకు పైగా స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసును.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు. కేసు నుంచి చంద్రబాబును తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేనంటూ తేల్చిన ఫోరెన్సిక్ నివేదికను కోర్టు ముందు ఉంచారు. వాయిస్ చంద్రబాబుదేనని తేలినప్పటికీ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. కేసు సరైన దారిలో విచారణ జరగలేదని పునర్ విచారణకు ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు… ఫోరెన్సిక్ నివేదికను పరిగణలోకి తీసుకుని కేసును పునర్‌విచారణ జరపాలని ఆదేశించింది. సెప్టెంబర్ 29లోగా కేసు పునర్ విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.


ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది.  ఓటుకు నోటు కేసులో చంద్రబాబును విచారించే దిశగా తెలంగాణ ఏసీబీ వేస్తున్న అడుగులకు 8 వారాల బ్రేక్ పడింది. చంద్రబాబు తరపున సీనియర్‌ కౌన్సిల్‌ సిద్ధార్థ లూథా వాదనలు వినిపించగా.. పిటిషనర్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తరపున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను మరో కోర్టు అడ్డుకోరాదన్న సుప్రీంకోర్టు నిబంధనలను ఆయన గుర్తు చేశారు. సెక్షన్ 156 ఆర్డర్ పై స్టే కోరుకునే హక్కు పిటిషనర్ కు లేదని చెప్పారు. ఆయన వాదనలను చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథా వ్యతిరేకించారు. ఏసీబీ మెమోను ఎలా ఇస్తుందని ప్రశ్నించిన న్యాయస్థానం, విచారణపై 8 వారాల స్టే విధించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిలను వివరణాత్మక కౌంటర్ ఇవ్వాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: