ఆంధ్రోళ్ళు అంటూ మొదటి నుంచీ తెలుగు మాట్లాడే సగం జనాభా ఆంధ్రా వారిని తక్కువ చేసి మాట్లాడేవారు కెసిఆర్. అధికారం లోకి రాక ముందు, ముఖ్యంగా తెలంగాణా ఉద్యమం మంచి ఊపులో ఉన్న రోజులలో " ఆంధ్రోళ్ళు " అనే మాట ఆయన నోటినుంచే వెలువడింది. ఆ తరవాత హైదరాబాద్, రంగారెడ్డి లలో కాస్త యాస గోదావరి వైపుది వినపడగానే " ఆంధ్రోడివా ? " అంటూ ప్రశ్నలు వెయ్యడం సర్వ సాధారణ విషయం. అధికారం చేజిక్కించుకుని ముఖ్యమంత్రి అయిన తరవాత మాత్రం ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఆంధ్రా ని చులకన చేసి మాట్లాడడం మానేశారు. ఎప్పుడో అరా కోరా తప్ప పెద్దగా వారి గురించి కూడా ఎత్తడం లేదు ఇప్పుడు.

అయితే ప్రభుత్వ పరంగా ఏపీ కి తన దైన శైలి లో ఝలక్ లు మాత్రం ఇవ్వడం మానలేదు ఆయన. వివిధ వ్యవహారాలలో ఆయన చేతిలో పగ్గాలు ఉన్నాయి అనుకున్న ప్రతీ అంశం ఆయన తన వాడి చూపిస్తూనే ఒచ్చారు. ప్రస్తుతం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం లో ఇదే జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమంటూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీం ఈ విషయం లో కేంద్రాన్ని మధ్యలోకి లాగింది. కేంద్రమే ఇద్దరి కష్టాలూ తీర్చాలి అనీ రెండు రాష్ట్రాలకీ న్యాయం చేకూరుస్తూ ఒక నిర్ణయం తీసుకోవాలి అని తేల్చింది కోర్టు. ఈ క్రమం లో కేంద్రం , సుప్రీం ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ నే తన స్టైల్ లో ఏపీ కి కెసిఆర్ ఝలక్ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తోంది. అపెక్స్ కమిటీ ద్వారా అంతర్రాష్ట్ర నీటి వ్యవహారం తేల్చుకోవాలి అని కోర్టు చెప్పగా కేంద్ర జల వనరుల శాఖ అపెక్స్ కమిటీ భేటీ కి సిద్దం అయ్యింది.

11 18 19 సెప్టెంబర్ నెలలో ఒక తేదీ ని ఖరారు చేసి చెప్పాలి అని రెండు రాష్ట్రాలకీ సందేశం పంపగా కనీసం భేటీ విషయం లో కూడా రెండు రాష్ట్రాల మధ్యనా సయోధ్య లేదు. ఏపీ ముఖ్యమంత్రి 19వ తేదీని నిర్ణయించగా - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర తేదీల్లో లేని 21వ తేదీని పెట్టుకోమంటున్నారు. కెసిఆర్ ఇచ్చిన తేదీ వెనకాల పెద్ద కథే ఉంది. 20 సెప్టెంబర్ నుంచీ తెలంగన శాసనసభ ప్రారంభం కాబోతోంది. 21 న డేట్ ఫిక్స్ చేసుకుంటే అపెక్స్ కమిటీ భేటీ నుంచి శాసనసభ సమావేశాల పేరు చెప్పి తప్పించుకోవచ్చు అనేది కెసిఆర్ ప్లాన్. ఇప్పటికే అపెక్స్ భేటీలు బాగా వాయిదా పడుతున్నాయి. ఇవి నెమ్మది నెమ్మదిగా అక్టోబర్ లేదా నవంబర్ వరకూ వెళ్లిపోవచ్చు అంటున్నారు. కృష్ణా జలాల వినియోగం - తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరాలు ఇలాంటి విషయాల్లో అపెక్స్ కమిటీ గట్టి నిర్ణయమే తీసుకోవాల్సి ఉంది. తెలంగాణా లో పలు నీటి అంశాలు, పథకాల మీద ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది.

ఈ మధ్యన ప్రతిపాదన కి వచ్చిన పాలమూరు రంగారెడ్డి పథకంపై ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రాజెక్ట్ వలన తమకి తీవ్ర నష్టం జరుగుతుంది అనేది వారి అభ్యంతరం. శ్రీశైలం బ్యాక్ వాటర్ ని ఆధారంగా చేసుకుని ఈ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్లు నిర్మిస్తారు అవి అనధికారికంగా వాడుకుని తెలంగాణా ప్రభుత్వం ఇవి నిర్మిస్తే ఏపీ వైపు నీళ్ళు రావడం అసంభవం. దాదాపు 120 టీఎంసీ ల కృష్ణా మిగులు జలాలు తెలంగాణా ఈ ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకుని ఫ్రీగా వాడుకుంటుంది. దీన్ని ఏపీ ఖండిస్తోంది. మరొక పక్క ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైందని ఇది కొత్త ప్రాజెక్టు కాదని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు. అలాగే ఏపీ లో మొదలిన పట్టిసీమ పథకం మీద  తెలంగాణా కేంద్ర జల వనరుల శాఖ కి ఫిర్యాదు అందించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నేపధ్యం లో పోలవరం వాటా 45 టీఎంసీల జలాలు బదులుగా కృష్ణా నీళ్ళు వాడుకుంటాం అని దానికి పర్మిషన్ ఇవ్వాలి అనేది తెలంగాణా డిమాండ్. ఏదేమైనా తెలంగాణా - ఏపీ విడిపోక ముందర వచ్చిన రకరకాల వార్తలు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా నిజం అవుతున్నాయి.

రాష్ట్రాలు విడిపోతే మొదట్లో నీళ్ళ గురించే గొడవలు, వాదనలు , ఫిర్యాదులు మొదలు అవుతాయి అని అప్పుడే విశ్లేషకులు చెప్పారు. పక్క రాష్ట్రాలు తమిళనాడు - కర్ణాటక విచ్చలవిడిగా నీళ్ళ విషయం లో కొట్టుకుంటూ ఉంటే మనం వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్న క్రమం లో నెమ్మది నెమ్మదిగా గిల్లి కజ్జాలకి పోయి పరిస్థితి వారి లాగా తెచ్చుకోకూడదు అని రాజకీయ నాయకులు సత్వరం ఆలోచించాలి. అపెక్స్ కమిటీ - కేంద్ర జల వనరుల శాఖ సహాయం తో ఒక విషయం లో కాకపోతే మరొక విషయం లో సర్దుకుని నీటి వివాదాలు రావణ కాష్టంగా మారకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఇద్దరు ముఖ్యమంత్రుల మీదా ఉంది. లేదంటే ఫిర్యాదులు వివాదాలుగా , వివాదాలు ప్రజా ఉద్యమాలుగా మారితే ఏపీ - తెలంగాణా ల మధ్య వైషమ్యాలు పెరిగి ప్రజలు రోడ్ల మీదకొచ్చి కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: