డ్రీమ్ టీమిండియా ఇదే..!

భార‌త టీమ్ ఇండియా 500వ టెస్ట్‌ సందర్భంగా బీసీసీఐ ఘనంగా వేడుకలు నిర్వహించింది. మాజీ కెప్టెన్లు, దిగ్గజ ఆటగాళ్లు, అధికారులను మ్యాచ్‌ ఆరంభానికి ముందు సత్కరించింది. చారిత్రక 500వ టెస్ట్‌ వేడుకల్లో అభిమానులను భాగస్వాములను చేయాలని భావించిన బీసీసీఐ ఫేస్‌బుక్‌లో మీ డ్రీమ్ జ‌ట్లును సెల‌క్ట్ చేయండని భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ఈ ఫలితాలను మ్యాచ్‌ ముగిసిన 5వ‌ రోజు వెల్లడించింది. 

ఆ డ్రీమ్ జ‌ట్టు వివ‌రాలు చూస్తే..
భారత అత్యుత్తమ టెస్ట్‌ లెవెన్ - ఫ్యాన్స్ ఓటింగ్  
1. సునీల్‌ గావస్కర్‌ - 68% 
2. వీరేంద్ర సెహ్వాగ్‌ - 86% 
3. రాహుల్‌ ద్రవిడ్‌ - 96% 
4. సచిన్‌ తెందుల్కర్‌ -73% 
5. వీవీఎస్‌ లక్ష్మణ్‌ - 58% 
6. కపిల్‌ దేవ్‌ - 91% 
7. ఎంఎస్‌ ధోని (కె)- 90 % 
8. ఆర్‌.అశ్విన్‌ - 53% 
9. అనిల్‌ కుంబ్లే - 92% 
10. జవగల్‌ శ్రీనాథ్‌ - 78% 
11. జహీర్‌ ఖాన్‌ - 83% 
12. యువరాజ్‌సింగ్‌ - 62%
ఈ డ్రీమ్ టీమ్‌లో చాలా మంది స్టార్ క్రికెట‌ర్ల‌కు చోటు దక్కలేదు. ప్రస్తుత క్రికెటర్లలో ధోని, యువరాజ్‌, అశ్విన్‌ జట్టులో స్థానం సంపాదించినా కోట్లాది అభిమానులున్న ఇప్పటి టెస్ట్‌ కెప్టెన్‌ కోహ్లీ, భారత్‌ను విజయాల బాట పట్టించిన మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, రవిశాస్త్రి, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ వంటి వారికి ఓట్లు లభించలేదు.


టీమిండియా చారిత్ర‌క విజ‌యం


కాన్పూర్‌: 
చ‌రిత్రాత్మ‌క 500వ టెస్టుతో జాతీయ ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించింది టీమిండియా. న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో కోహ్లి టీమ్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్‌పై 197 ప‌రుగుల భారీ తేడాతో టీమిండియా గెలిచింది. 434 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిని కివీస్ టీమ్‌.. చివరిరోజు 236 ప‌రుగుల‌కే ఆలౌటైంది. రోంచి, సాంట్న‌ర్ పోరాడినా.. న్యూజిలాండ్‌ను ఓట‌మి నుంచి గ‌ట్టెక్కించ‌లేక‌పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మ‌రో 6 వికెట్లు తీసి మ్యాచ్‌లో ప‌ది వికెట్ల ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీయ‌డం అత‌నికిది ఐదోసారి. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియాకు 1-0 ఆధిక్యం ల‌భించింది. మ్యాచ్ లో మొత్తం 92 పరుగులు చేసి, 6 వికెట్లు తీసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 


రాహుల్‌గాంధీపై బూటు విసిరిన వ్య‌క్తి


సీతాపూర్ (యూపీ): 
కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీకి చేదు అనుభ‌వం ఎదురైంది. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌లో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌పై.. ఓ వ్య‌క్తి బూటు విసిరాడు. అయితే ఈ బూటు దాడి నుంచి రాహుల్ తృటిలో త‌ప్పించుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ బూటు రాహుల్ వెన‌కాలే ఉన్న వ్య‌క్తి చేతికి త‌గిలింది. త‌న‌వైపు బూటు విస‌ర‌డాన్ని రాహుల్‌గాంధీ గ‌మ‌నించారు.


జ‌వాన్ల‌కు విరాట్ కోహ్లీ స‌లాం


కాన్పూర్ : 
యురి దాడిలో ప్రాణాలు కోల్పోయిన భార‌తీయ జ‌వాన్ల‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నివాళి అర్పించాడు. న్యూజిలాండ్‌తో కాన్పూర్ లో జ‌రిగిన టెస్ట్‌లో విజ‌యం సాధించిన అనంత‌రం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. త‌రుచూ పెద్ద పెద్ద సంఘ‌ట‌న‌లు జరుగుతుంటే బాధేస్తుంద‌ని అన్నాడు. యురి ఘ‌ట‌న ప‌ట్ల భావోద్వేగానికి లోనైట్లు చెప్పాడు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై రియాక్ష‌న్ ఇవ్వ‌గ‌ల‌ను, కానీ ప‌రిష్కారం చూప‌లేన‌న్నాడు. మృతి చెందిన జ‌వాన్ల‌ కుటుంబాల‌కు కోహ్లీ సంతాపం ప్ర‌క‌టించాడు. ఒక భార‌తీయుడిగా ఇలాంటి ఘ‌ట‌నలు త‌నను క‌లిచివేస్తాయ‌న్నాడు. 


అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం


హూస్ట‌న్ : 
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మ‌రోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. హూస్ట‌న్‌లోని షాపింగ్ మాల్‌లో ఓ సాయుధుడు కాల్పుల‌కు దిగాడు. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు గాయ‌ప‌డ్డారు. ఆ సాయుధున్ని కాల్చి చంపిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇత‌ర సాయుధులు ఎవ‌రూ లేర‌ని తేల్చేశారు. గాయ‌ప‌డ్డ‌వాళ్ల‌ను స్థానిక ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కార్ల‌లో కూర్చున్న కొంద‌రిపై సాయుధుడు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే స్థానికుల‌ను మాత్రం బ‌య‌ట‌కు వెళ్ల‌రాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కే ఓ వ్య‌క్తి రివాల్వ‌ర్‌తో వాహ‌నాల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు దిగిన‌ట్లు స‌మాచారం. 


హిందువుల‌పై ట్రంప్ ప్ర‌శంస‌లు


వాషింగ్ట‌న్ : 
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీప‌డుతున్న‌డోనాల్డ్ ట్రంప్ హిందువుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌పంచ నాగ‌రిక‌త‌కు, అమెరికా సంస్కృతికి హిందూ వ్య‌వ‌స్థ ఎంతో తోడ్పాటునిచ్చింద‌ని  ట్రంప్ అన్నారు. వ‌చ్చే నెల‌లో న్యూజెర్సీలో జ‌రిగే ఇండో-అమెరిక‌న్ స‌ద‌స్సులో ఆయ‌న పాల్గోనున్నారు. ఆ స‌మావేశం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఉగ్రవాద బాధితుల‌కు ఖ‌ర్చు చేయ‌నున్నారు. అమెరికా సంస్కృతికి ఎంతో స‌హ‌క‌రించిన హిందూ స‌మాజ వ్య‌వ‌స్థ‌తో త‌మ బంధాన్ని కొన‌సాగించ‌నున్న‌ట్లు ట్రంప్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అక్టోబ‌ర్ 15న జ‌ర‌గ‌నున్న స‌భ‌కు సంబంధించిన వీడియో సందేశాన్ని కూడా ట్రంప్ విడుద‌ల చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: