దేశవ్యాప్తంగా సమ్మె సైరన్ మోగింది. నేటి నుంచి రెండు రోజులపాటు 11 కేంద్ర కార్మిక సంఘాలు, కార్మిక సమాఖ్యలు సమ్మెకు పిలుపునిచ్చాయి. పది డిమాండ్లతో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుతో సర్కార్ కార్యాలయాలు వెలవెలబోనున్నాయి. ధరల పెరుగుదలతో పాటు సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు కనీస సౌకర్యాలకు నోచుకోవడంలేదని, కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని... శ్రమదోపిడీకి గురవుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండురోజుల సమ్మె ప్రభావంతో దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లనుంది. మరోవైపు నష్టనివారణపై సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ సారథ్యంలోని సీనియర్ మంత్రుల కమిటీ కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రెండ్రోజుల పాటు.. జరగనున్న ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా పాలనా వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా నష్టపోయే అవకాశముంది. సమ్మెలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ధరల పెరుగుదలతో సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు కనీస సౌకర్యాలకు నోచుకోవడంలేదని, కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని, శ్రమదోపిడీకి గురవుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు వారికి సర్వీసులను క్రమబద్దీకరించి, వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఎఐటియుసి రాష్ట్రఅధ్యక్షులు ఒబేలేశు కోరారు. సార్వత్రిక సమ్మెకు భారీ స్పందన లభిస్తోంది. ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో సమ్మెను అణచివేయడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. సార్వత్రిక సమ్మెలో పాల్గొంటే వేతనాల్లో కోత విధించడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరించింది. సమ్మె సమయంలో ఉద్యోగులెవరికీ సెలవులు ఇవ్వొద్దని సూచిస్తూ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. సమ్మెలో ఎంత మంది పాల్గొన్నారన్న వివరాలు అదేరోజు సాయంత్రానికల్లా తమకు పంపాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: