హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్ళ ఘటనతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా దళాన్ని ఆదేశించింది. మరోవైపు హైదరాబాద్ బాంబు పేలుళ్ల ఘటనను నేషనల్ ఇన్వెస్ట్ గేషన్ ఏజెన్సీకి అప్పగించింది. ఎన్ఐఏ టీ టీం సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించింది. బాంబు పేలుళ్లకు సంబంధించిన ఆనవాళ్లను సేకరించే ప్రయత్నించేసింది. ఆధారాలు రాబట్టింది. ఉగ్రవాద చర్యేనని ఎన్ఐఏ ప్రాథమిక నిర్ధారకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలోనూ అప్రమత్తమైన పోలీసులు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంతకల్లు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలను ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటుచేసి మరీ తనిఖీలు చేస్తున్నారు. తిరుమలకు భక్తుల తాకిడి ఉండడంతో రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి గేటు దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరీ పంపుతున్నారు. మొత్తం మీద దిల్ సుఖ్ నగర్ ఘటన రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదులు ఇంకెక్కడ విధ్వంసం సృష్టిస్తారోనని అంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... శాంతియుతంగా ఉండాలని సీఎం కిరణ్, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వదంతులు నమ్మవద్దని, అనుమాతులుగాని, అనుమానాస్పద వస్తువులు కాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: