మరక అంటిన రాష్ట్రమంత్రులకు షాక్ కొట్టబోతోంది. రాష్ట్ర కేబినెట్ లో మార్పులు చేర్పుల ఊహాగానాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేబినెట్ లో మంత్రులుగా మారే వారు ఎవరు? మాజీలుగా మిగిలేవారు ఎవరు. ఎందరికి ప్రమోషన్ వస్తుంది..? ఎంతమందిపై వేటు పడుతుంది? ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్.

ఇంటా బయటా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కళంకిత మంత్రులను తోలగించాలనే నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ వచ్చిందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కేబినెట్ లో మార్పులు, చేర్పుల కోసం సీఎం కిరణ్ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సీఎం కిరణ్  ఢిల్లీ వెళ్ళటమే తరువాయి అన్నట్టుగా పరిస్దితి కన్పిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఢిల్లీ వెళతారనే సమాచారం.

ఆశావహుల మాట అలా ఉంచితే.. కేబినెట్ నుంచి ఎవరెవరిపై వేటు పడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కళంకిత మంత్రులు విషయాన్ని పరిశీలిస్తే.. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. జగన్ అక్రమాస్తులకు సంబందించిన వివాదాస్పదజీవోల్లో నిందితురాలు.. చార్జిషీట్ లో 4వ  నిందితులరాలిగా సిబిఐ పేర్కొంది. తాజాగా సమన్లు జారీ అయ్యాయి. దీంతో మంత్రి భవితవ్యం ప్రశ్నార్దకంగా మారింది. మంత్రి దర్మాన ప్రసాదరావుపై వాన్ పిక్ కేసులో చార్జిషీట్  దాఖలైంది. ప్రస్తుతం న్యాయస్దానాల చుట్టూ తిరుగుతున్నారు.

మంత్రి పోన్నాల.. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వివాదాస్పద జీవోల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రిం కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. మంత్రి గీతారెడ్డి.. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన జీవోల్లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మరో మంత్రి కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్నారు.

ఉండే వారెవరు? ఊడేదెవరు..?
కళంకిత మంత్రులను తోలగించాలని సీఎం భావిస్తే ఐదుగురు మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. ఇతర కేసుల్లో మంత్రి పార్దసారధి ఇరుకున్నారు. ఫెమా ఉల్లంఘన కేసుతో పాటు ఎన్నికల సంఘం కేసులో మంత్రి ఆరోపణలు ఎదుర్కోటున్నారు. ఇక సీఎం వ్యతిరేక వర్గంగా ఉన్న నేతల వివరాలు పరిశీలిస్తే.. డీఎల్ రవింద్రారెడ్డికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఆయన స్దానంలో డీఎల్ వియ్యంకుడు, గాదె వెంకట్ రెడ్డి కి చాన్స్ ఇవ్వొచ్చు. సీఎం కు పక్కలో బల్లెంగా మారిన  రామచంద్రయ్య ను కూడా సాగనంపొచ్చు. ఆయన స్దానంలో మరోకరికి అంటే వంగా గీతా కు అవకాశం ఇవ్వొచ్చు. డిప్యూటి సీఎంకి, జానారెడ్డికి, బొత్సాలకు శాఖలను మార్చే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రజల యోగ క్షేమాలు చూడాల్సి న కేబినెట్ మంత్రులు సొంత వ్యవహారాల్లో తలమునకలయ్యారు. కేసుల్లో ఇరుక్కున్న సగం మంది మంత్రులు న్యాయస్దానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయం చెయ్యాల్సిన మంత్రులు న్యాయస్దానాల ముందు దోషులుగా హాజరవుతుంచడం రాష్ట్రంలో వింతగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: