ఏపీకి ప్రత్యేక హోదా.. అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమ తరహాలో ఏపిలో ప్రజలు ఉద్యమించాలంటూ ట్విట్టర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వరుస ట్వీట్లు..ఏపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా  సోషల్ మీడియాలో చేస్తున్న ప్రకటనలే ఇందుకు కారణం. అయితే టిడిపి మాత్రం ప్రత్యేక హోదాపై తమ వైఖరిలో మార్పులేదని చెబుతూనే, ప్రత్యేక ప్యాకేజి విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. 

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఏపి రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమం... స్పెషల్‌ స్టేటస్‌ ఉద్యమానికి తిరిగి జీవం పోసిందనే చెప్పాలి. జల్లికట్టు ఉద్యమంపై కేంద్రం దిగిరావటంతో, ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఈనెల 26న విశాఖ బీచ్ లో యువకులు చేస్తున్న మౌన ప్రదర్శనకు మద్దతు తెలిపిన పవన్, జనసేన కార్యకర్తలు కూడా ఆ ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ్ బచావో పేరుతో ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్న ఓ మ్యూజికల్ ఆల్బమ్ ను కూడా జనవరి 24న విడుదల చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఇటు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలకు మద్ధతుగా సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా నెలకొంటున్న పరిణామాలను అధికార టిడిపి కూడా సునిశితంగా పరిశీలిస్తోంది. ప్రత్యేక హోదా అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేస్తున్న పోరాటంపై టిడిపి ఎలాంటి విమర్శలు చేయటం లేదు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కేవలం రాజకీయం కోసమే పోరాటం చేస్తున్నారంటూ ఆరోపిస్తుంది.  ప్రత్యేక హోదాపై అధినేత చంద్రబాబు ఒకే స్టాండ్ పై వున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యేక ప్యాకేజిని స్వాగతించటం ద్వారా.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని భావిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై పట్టుబట్టిన బీజేపి, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హామీని నిలబెట్టకోలేక పోయిందన్న వాదనను టీడీపీ వినిపిస్తోంది. 

ప్రత్యేక హోదాపై  ప్రత్యక్ష పోరాటానికి జనసేన, వైసిపి నేతలు సిద్ధమవుతుంటే... అధికార టిడిపి మాత్రం కేంద్రంపై తమ ఎంపిల ద్వారా వత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తుంది.  ప్రత్యేక హోదాపై  పాలక, ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు..ఎంత వరకు సఫలీకృతం అవుతాయో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: