ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని మళ్లీ కొలిచేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) కసరత్తు ముమ్మరం చేస్తోంది. మరో రెండు నెలల్లో జీఎస్ఐ ఈ పనులు ప్రారంభించనుంది. ఎత్తుని లెక్కించేందుకు కనీసం నెలరోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లోనే నెల సమయం తీసుకుంటే పూర్వం ఎలా లెక్కించేవారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.


ఎవరెస్టు శిఖరాన్ని కొలిచేందుకు 19వ శతాబ్ది ప్రారంభంలో థియోడొలైట్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఎత్తును కొలిచేందుకు ఈ పరికరాల్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన థియోడొలైట్లు అయిదింటిని రూపొందించారు. వాటిలో ఒకటి ఎవరెస్ట్ ఎత్తు కొలిచేందుకు సాయపడింది. ఆ పరికరం ఇప్పటికీ జీఎస్ఐ దగ్గరే ఉండటం విశేషం. కానీ థియోడొలైట్ చెప్పిన లెక్క డిజిటల్ యుగంలోనూ తప్పుకాలేదని తేలింది. అత్యంత అధునాతన పరిజ్ఞానంతో ఎవరెస్టు ఎత్తుపై మదింపు వేసినా పాత లెక్క కరెక్టేనని తేలడం గమనార్హం…


భారత సర్వేయర్ జనరల్ గా 1823లో ఇండియా వచ్చిన జార్జ్ ఎవరెస్ట్ దాదాపు పాతికేళ్ల ఈ క్షేత్రాల మ్యాపుల తయారీకే అంకితం చేశాడు. తర్వాత ఆయన శిష్యుడు హిమాలయ శ్రేణుల్లో అత్యంత ఎత్తైన పీక్ 15 శిఖరాన్ని కనుగొన్నాక దానికి తన గురువు పేరు పెట్టుకున్నాడు. అలా 1840ల తర్వాత ఎవరెస్టు శిఖర ప్రపంచానికి పరిచయం అయింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ శిఖరాల మ్యాపింగ్ కి దాదాప యాభై యేళ్లు పట్టిందని చెబుతారు. ఒక్క ఎవరెస్టు శిఖరం ఎత్తు కొలిచేందుకే ఏళ్ల తరబడి శ్రమించి ప్రత్యేక థియోడొలైట్లు తయారు చేయించడం విశేషం.


ఇటీవల హిమాలయ రాజ్యం నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం తర్వాత ఎవరెస్టు ఎత్తుపై కొత్త సందేహాలు వచ్చాయి. 8,848 మీటర్ల ఈ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. 2015 ఏప్రిల్ 25న నేపాల్ లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భారీ భూకంపం వల్ల భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్లలో తీవ్ర మార్పులు సంభవించాయని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఎవరెస్టు శిఖరం దాదాపు మూడు సెంటీమీటర్లు కుంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో మళ్లీ ఎవరెస్టు ఎత్తుని అంచనా వేసే బృహత్కార్యానికి జీఎస్ఐ శ్రీకారం చుట్టబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: