సద్దుమణిగినట్టే కనిపించిన చిల్లరనోట్ల సమస్య మళ్లీ రాజుకుంటోంది. 500, 1000రూపాయల నోట్ల రద్దు తరువాత రెండు నెలలకు పైగా నగదు అందుబాటులో లేక ఏటీఎంలు, బ్యాంకులు ఖాళీగా దర్శనమిచ్చాయి. తరువాత మెల్లిగా పరిస్థితుల్లో పురోగతి కనిపించింది. కొత్త 500నోట్లు అందుబాటులోకి రావడంతో... ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ప్రస్తుతం నెల మొదటి వారం కావడంతో.. మళ్లీ ఏటీఎం ల కష్టాలు మొదలయ్యాయి. నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.


ఉద్యోగులకు జీతాలు అందే సమయం కావడంతో.. ప్రతీ ఒక్కరూ ఏటీఎంలకు క్యూ కడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు 25శాతం ఏటీఎంలలో డబ్బులు లేవు. నో క్యాష్ బోర్డులు కనపడుతున్నాయి. నెలమొదటి వారం కావడం, ఏటీఎంల నుంచి విత్ డ్రా పరిమితి పెంచడంతో ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. లక్షలాది మంది కార్మికులకు డబ్బు రూపంలోనే రోజు వారీ కూలీలు చెల్లిస్తారు. సాధారణంగా నెల మొదటి వారంలో చెల్లింపులు చేయాల్సి ఉన్నందున నగదు ఎక్కువగా తీస్తున్నారు. కొన్ని కంపెనీలు మొదటి తేదీ నాడే జీతాలు ఇస్తే మరికొన్ని కంపెనీలు 10-15 తేదీల వరకు కూడా ఇస్తుంటాయని, దానివల్ల ఇంతకుముందు కంటే తాము ఏటీఎంలలో నగదు ఎక్కువగానే నింపుతున్నా త్వరగా అయిపోతోందని బ్యాంకు సిబ్బంది అంటున్నారు.

 

ఫిబ్రవరి రెండో వారం నాటికి ఏటీఎంలో నగదు కొరత తీరుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటికీ అన్ని ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఏటీఎంల నుంచి ఒకేసారి రూ. 24వేల వరకు విత్ డ్రా అవకాశాన్ని ఫిబ్రవరి 1నుండి రిజర్వు బ్యాంకు కల్పించింది. రోజుకు దాదాపు రూ. 12వేల కోట్ల నగదును ఏటీఎంలలో పెడుతున్నారు. అయితే నోట్ల రద్దుకు ముందు దాదాపు రూ. 13వేల కోట్లు పెట్టేవారు. పెద్ద నగరాల్లో కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే నగదు కొరత ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల పాటు నగదు కష్టాలు తప్పవని మాత్రం స్పష్టమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: