కోడెల శివప్రసాదరావు.. ఒకప్పుడు పవర్ ఫుల్ నాయకుడు.. ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాల్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. హోం శాఖ వంటి కీలక పాత్ర పోషించిన చరిత్ర ఉంది. కానీ  మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎందుకో చంద్రబాబు కోడెలను కరుణించలేదు. స్పీకర్ పదవితో సరిపెట్టారు. 


దాంతో క్రియాశీల రాజకీయాల్లో అంత చురుగ్గా ఉండే అవకాశం లేని కోడెల.. తరచూ వాచాలత్వంతో చంద్రబాబుకు చిక్కులు తెస్తున్నారు. ఓవైపు మహిళాపార్లమెంట్ నిర్వహిస్తూ కూడా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కోడెలకే చెల్లింది. మహిళలను వాహనంతో పోలుస్తూ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి.


ఆయన ఏమన్నారంటే.. ఒక వాహనం కొని షెడ్‌లో ఉంచితే ప్రమాదాలు జరగవు.. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయట తిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారు. అలాగని వారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి.. ’ అని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంటూ సెలవిచ్చారు. 


స్పీకర్ పదవిలో ఉండి.. అంత బాధ్యతారహితంగా మాట్లాడటం ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. గతంలో 12 గంటల పాటు పనిచేసే తనకు స్పీకర్‌గా ప్రస్తుతం పెద్దగా పని ఉండటం లేదన్న కోడెల.. పని లేకనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: