మానవ ఉపాధిని మరమనుషులు స్వాధీనం చేసుకునే క్రమం ఇప్పటికే ఆరంభం అయిపోయింది. టేకోవర్ ఇప్పటికే మొదలైపోయింది. రోబోలే పూర్తి ఉపాధిని ఆక్రమించిన పారిశ్రామిక రంగాలు ఇప్పటికే ఉనికిలోకి వచ్చాయి. భవిష్యత్‌లో మరిన్ని రంగాలు ఈ రోబోలతో నిండిపోనున్నాయి. కోట్లాది మంది ఉద్యోగాలు గల్లంతు కానున్నాయి


రోబోలు అనగానే అచ్చంగా మెకానికల్‌గా పనిచేసే మర మనుషులు మాత్రమే కాదు. కంప్యూటర్ టెక్నాలజీ, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న అభివృద్ధి రోబోట్లను మరింత సమర్ధవంతంగా తయారు చేయడానికి దోహదం చేస్తోంది. మనుషులకు పోటీగా, మనుషుల కంటే మిన్నగా కూడా రోబోట్లను తయారు చేయగల పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో మెదడు ఉపయోగించి చేసే పనులకు కూడా రోబోలను అభివృద్ధి చేస్తున్నారు.


హ్యూమనాయిడ్స్‌తో ప్రకృతి వైపరీత్యాలు, వినాశనం సంగతి పక్కనపెడితే.. ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చే ముప్పు ఏంటంటే.. ఉద్యోగానికి ఎసరు. రోబోలతో ఎంతోమంది ఉద్యోగాలు గల్లంతు కానున్నాయి. ఇంతకీ ఈ రోబోలు ఎన్ని ఉద్యోగాలకు ఎర్త్‌ పెడుతున్నాయో వింటే.. నోరెళ్ల బెట్టాల్సిందే. ఆ సంఖ్య... వందలు, వేలు, లక్షలు కాదు.. కోట్లు... వేలకోట్లు. ఎస్‌.. మీరు వింటున్నది నిజమే. ప్రపంచవ్యాప్తంగా మరమనుషుల దెబ్బకు అక్షరాలా వేల కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. 


ఆఫీసులో కూర్చుని చేసే పనులకు కూడా రోబోలు వచ్చేస్తున్నాయి. అందుకే.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలన్నీ తమ కార్మికులు, పాలనా సిబ్బంది స్ధానంలో రోబోట్లు ప్రవేశపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. అవిగనక అమలైతే... అడ్మినిస్ట్రేటివ్, సెక్రటరీ పోస్టులన్నీ రోబోలే ఆక్రమించనున్నాయి. మెకానిక్కులు, మెషీన్ డ్రైవర్లు, మెకానికల్ టెక్నీషియన్లు మొదలైన శారీరక శ్రమల రంగంలో 2/3 వంతు ఉపాధిని రోబోలు లాగేసుకోనున్నాయి. నిజానికి రోబోల వల్ల ప్రభావితం కానీ రంగమే లేదు. కాకపోతే కొన్ని రంగాల్లో తక్కువగా.. కొన్ని రంగాల్లో ఎక్కువగా ఉపాధి కోల్పోతారు. 


అయితే... డాక్టర్లు, లెక్చరర్ల ఉపాధికి వచ్చిన భయమేమీ లేదు. డాక్టర్ల పనిని రోబోలు ఎలాగూ చేయలేవు కాబట్టి వారు భయపడాల్సిన పనిలేదు. విద్యారంగంలో మాత్రం అందరివి కాకపోయినా కొందరి ఉద్యోగాలు పోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నత స్ధానాల్లో ఉన్నవారికి కూడా రోబోలతో వచ్చే ముప్పేమీ లేదు. 


రోబోల ఎంట్రీతో.. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన జర్మనీలాంటి దేశాలు కూడా వణికిపోతున్నాయి. అక్కడ ఇప్పటికే పలు రంగాల్లో పనిలోకి దిగిన రోబోలు... ప్రజల ఉపాధిని హరించివేస్తున్నాయి. ఇది ఫ్యూచర్‌లో మరింతగా పెరిగి... మొత్తంగా కోటి 80లక్షల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతాయని ఓ అంచనా. 


ఇది ఒక్క జర్మనీకి మాత్రమే పరిమితం కాలేదు. ఫిన్లాండ్, నెదర్లాండ్స్ లాంటి యూరోపియన్ దేశాలతోపాటు... రోబోట్‌ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ది చెందుతున్న ఆసియాలోని జపాన్, చైనా దేశాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించింది. అటు అమెరికా, రష్యాలాంటి అగ్రదేశాలు కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని మరమనుషుల వైపు అడుగులు వేయనున్నాయి. అంటే.. అన్నిదేశాల్లోనూ మానవుల కంటే మరమనుషులే అధికంగా పనిచేసే రోజులు రానున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల మంది ఉద్యోగాలు ఊస్ట్‌ కానున్నాయి. సో... ఇప్పుడు ఉద్యోగాల కోసం వేలం వెర్రిలా అమెరికా వెళ్తున్నవారు.. ఆంక్షలు విధిస్తున్న ఆ దేశం అధ్యక్షుడు ట్రంప్‌ను తిడుతున్న వారు.. అందరూ.. అందరూ... భవిష్యత్‌లో ఉన్న ఊరికి తిరిగిరాక తప్పదన్నమాట. అయితే.... కొంతలో కొంత బెటరేంటంటే.. రోబోల నిర్వహణకు కూడా మనుషులు కావాలి గనుక ఆ రంగంలో కొత్తగా కొంతమందికి ఉపాధి దొరుకనుంది.


మొత్తంగా.. మరమనుషుల చేత అన్ని పనులు చేయించగల సామర్ధ్యం మనిషికి వస్తే... అది ఉన్నత సాంకేతిక పరిజ్ఞానానికి తార్కాణమవుతుందేమో గానీ... మానవ సమాజానికి మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతిమ ఫలితం పొందేది కంపెనీల యజమానులు మాత్రమే. అంటే.. సంపద కేంద్రీకరణ మరింత తీవ్రమై, ప్రజలు అధిక సంఖ్యలో ఉపాధి కోల్పోయి సామాజిక రుగ్మతలు ఊహించనంతగా విస్తరించే ప్రమాదం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: