ఇంకా మార్చి నెల కూడా మొదలుకాలేదు. కానీ.. ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశించేనాటికి వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు 26 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతల్లో మార్పు సంభవించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5.7 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. అప్పుడే 40 డిగ్రీల సెల్సియస్‌ దాటేశాయి. 


Related image

మహబూబ్‌నగర్‌లో గురువారం ఫిబ్రవరి నెలకు సంబంధించి పదేళ్ల రికార్డు బ్రేకయింది. ఇక్కడ 2009లో ఫిబ్రవరి 26న 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఇప్పుడు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లోనూ ఇంతే. ఫిబ్రవరిలో పదేళ్ల గరిష్ఠ ఉష్ణోగ్రత (36.8 డిగ్రీల) నమోదైంది. ఇక హైదరాబాద్‌లోనూ గురువారం 37.7 డిగ్రీల సెల్సియస్‌ ఎండ కాసింది.  రాయలసీమలోని కర్నూలు జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, ఇక మే నెలలో వాతావరణం ఎలా ఉండనుందో అంటూ జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 



అనంతపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కేవలం రాయలసీమకు మాత్రమే పరిమితం కాలేదని, తెలంగాణలో కూడా ఇదే తీరున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సారి తెలంగాణకు ఉత్తర, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తుండడంతో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా ఖమ్మం.. మెదక్‌లలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇక్కడ రాత్రివేళ సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: