ఓటరు నాడిని ముందే పట్టేస్తూ, ఉత్కంఠను రేకెత్తిస్తూ ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ ఫలితాలు గురువారం సాయంత్రమే వెలువడ్డాయి! వీటి ప్రకారం‘పాంచ్‌ పటాకా’లో బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్‌ను మినహాయిస్తే కీలకమైన యూపీతో పాటు మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ అధికారంలోకి రావడమో,అత్యధిక స్థానాలు గెలుచుకునే పార్టీగా నిలవడమో ఖాయమని తేలుతోంది.  403 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెప్పాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల సగటును చూస్తే.. బీజేపీకి యూపీలో 164–210 సీట్లు రావొచ్చని తేలింది. అధికారం చేపట్టేందుకు కావాల్సిన 202 (మ్యాజిక్‌ ఫిగర్‌) సీట్లకు కొద్ది దూరంలో బీజేపీ ఆగిపోతుందని, ఫలితంగా హంగ్‌ సర్కారు ఏర్పడుతుందని కొన్ని సర్వేలు పేర్కొనగా..



మరికొన్ని మాత్రం ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలిపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అధికారంలోకి రాకుండా నిలువరించడానికి ‘అన్ని అవకాశాలూ’ పరిశీలిస్తామని ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ గురువారం బీబీసీకి చెప్పారు. బీఎస్పీతో ఎన్నికల అనంతర పొత్తుకు అవకాశాలను ఆయన పూర్తిగా తోసిపుచ్చలేదు. యూపీలో రాష్ట్రపతి పాలనను ఎవరూ కోరుకోవడం లేదన్నారు. తమ కూటమే ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తుందనీ, అవసరమైతే అన్ని అవకాశాలూ పరిశీలిస్తామనీ పేర్కొన్నారు.  ఉత్తరాఖండ్, గోవాలో కూడా బీజేపీ గాలి వీస్తున్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని మెజారిటీ సర్వేలు తేల్చాయి.



40 అసెంబ్లీ సీట్లున్న గోవాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకోలేదని కొన్ని, ఆ పార్టీయే అధికారం చేపడుతుందని మరికొన్ని తెలి పాయి. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్‌ మధ్య హోరా హోరీ ఉంటుందని, ఇక్కడ ఏ పార్టీ అయినా బొటాబొటీ మెజారిటీతోనే అధికారం చేపట్టవచ్చని పేర్కొన్నాయి. మణిపూర్‌లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే తెలపగా.. బీజేపీ గద్దెనెక్కుతుందని సీ–ఓటర్‌ పేర్కొన్నాయి. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీల జాతకాలు శనివారంతో తేలిపోనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: