గతంలో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన ఓ వ్యక్తి హైదరాబాద్ లో అనూహ్యంగా దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని  పగిడ్యాల గ్రామంకు చెందిన గుంపుల రవికుమార్‌ 2014 సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ గుంపుల రవికుమార్ హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. 



నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తప్పుడు సర్టిఫికెట్లుతో ఎస్సి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశాడని, అతని ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్తో పాటు స్థానిక పోలీసులకు గుంపుల రవి కుమార్ ఫిర్యాదు చేశాడు. 2015వ సంవత్సరంలో ఇదే అంశం పై హైకోర్టులో కూడా పిల్ వేశాడు గుంపుల రవికుమార్. అయితే ఆ సమయంలో తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆరోపించాడు. 



అంతే కాదు.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కర్నూల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.. హైదరాబాదు లోని అఫ్జల్ గంజ్ పోలిసులకు కూడా కొన్ని సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేశాడు.  ప్రస్తుతం ఆ కేసు విచారణలోనే ఉంది. ఇంతలోనే గుంపుల రవి హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. 
 



మృతుడు గుంపుల రవి కుమార్ స్వస్థలం కర్నూల్ జిల్లా పగిడ్యాల.  ఆరునెలల క్రితం వివాహం చేసుకున్న రవికుమార్ హైదరాబాదులోనే నివాసం ఉంటున్నాడు. రవి కుమార్ మృతిపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని అతని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అతను వైసీపీ ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణల కారణంగా రవి కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: