ఏపీ రాజధాని నిర్మాణంలో ఇవాళ ఓ కీలక ముందడుగు పడబోతోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన స్టార్టప్‌ ఏరియా డెవల్ప్ మెంట్ కోసం ఏపీ సర్కారు సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. అమరావతిలోని పాలనా కేంద్రం లో 1,691 ఎకరాల పరిధిలోని 6.84 చదరపు కిలోమీటర్లలో దీనికి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. 



సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌తోపాటు ఆ దేశ ప్రతినిధులు, రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులు, రాజధాని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మందడం, తాళ్లాయపాలెం గ్రామాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం, బహిరంగసభకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. శంకుస్థాపనకు ముందు విజయవాడ గేట్‌వే హోటల్‌లో ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సంతకాలు చేస్తారు.



సింగపూర్‌కు చెందిన అసెండాస్‌- సింగ్‌బ్రిడ్జి, సెంబికార్ఫ్‌ సంస్థల కన్సార్టియానికి సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ అందజేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ మధ్య ముఖాముఖి సమావేశం జరుగుతుంది. స్టార్టప్‌ ప్రాంతానికి కేటాయించిన 1,691 ఎకరాల ప్రాంతం... కృష్ణాతీరం వెంట- 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయాన్ని ఆనుకుని విస్తరించి ఉంది. 




రాజధాని కీలక ప్రాంతాన్ని 15 ఏళ్లల్లో మూడు దశల్లో అభివృద్ధి చేస్తారట. తొలిదశలో 650 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాలు అభివృద్ధి చేస్తారట. ఐతే.. ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. కానీ.. ఈ పద్దతిపై ఇప్పటికే విమర్శలు వస్తున్నా చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఈ ఒప్పందం అమరావతిని ఏ తీరాలకు తీసుకెళ్తుందో.. !?



మరింత సమాచారం తెలుసుకోండి: