తుళ్లూరు కేంద్రంగానే నవ్యాంధ్ర రాజధానిని నిర్మించడానికి కారణాలేంటో చంద్రబాబు సర్కార్ ఇంతకుముందే చాలా సార్లు చెప్పింది. అన్నింటికంటే మించి రాష్ట్రానికి మధ్యలో ఉండడం, నదీముఖంగా ఉండడం.. లాంటి అనేక కారణాలను వివరించింది. అయితే విపక్షాలు మాత్రం రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అంగీకరించడం లేదు. వైసీపీ దొనకొండకు ఓటేస్తే.. కాంగ్రెస్ మాత్రం ఏదీ చెప్పకుండా ఎంపిక చేసిన ప్రతిదాన్నీ విమర్శిస్తూ వస్తోంది.

 

అమరావతి రాజధాని అని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే చాలా ముందుకెళ్లింది. రహదారులు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. భవనాలూ సిద్ధమవుతున్నాయి. విద్యాసంస్థలు వెలుస్తున్నాయి. రాకపోకలు పెరిగాయి.. ఈ సమయంలో తుళ్లూరుకు శాపమందని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ సంచలనం కలిగించారు. తుళ్లూరు శపించబడిన ప్రాంతమని.. అందుకే అక్కడ కాలుమోపినవారెవ్వరూ అభివృద్ధిలోకి రాలేదని చెప్పారు.

 

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తుళ్లూరులో అడుగుపెట్టి రాజధానిని నిర్మించినా అభివృద్ధి జరగదని చింతామోహన్ స్పష్టం చేశారు. తుళ్లూరులో అడుగుపెట్టిన చంద్రబాబుకు పతనం తప్పదని తిట్టిపోశారు. అయితే చంద్రబాబు కుటుంబం మాత్రం అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు అన్నారు. తుళ్లూరుకు శాపమున్నప్పుడు ఎవరూ అభివృద్ధిలోకి రారన్న చింతామోహన్.. చంద్రబాబు కుటుంబం మాత్రం అభివృద్ధి చెందుతుందనడం విడ్డూరంగా అనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: