గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు ఇరు పార్టీల వారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి.  అధికార పార్టీ ఎత్తులకు ప్రతి పక్ష పార్టీ పై ఎత్తులు వేస్తున్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన నంద్యాలలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.  ఈ సందర్బంగా ఆయన అధికార పార్టీ చేస్తున్న ఆగడాలు ఎండగట్టారు.  ప్రజలకు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ కల్లబొల్లి మాటలే అని..ఇప్పటి వరకు ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రాబోయే మహా సంగ్రామానికి నంద్యాలే నాంది కావాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.  వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డితో కలిసి ఆయన కానాలలో రోడ్‌ షో నిర్వహించారు.  ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ఇవాళ జరిగేది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక. మీరందరూ ధర్మంవైపు నిలబడి ఓటు వేయండి.

నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటా. రాబోయే రోజుల్లో మన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరాలి. ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి చేరితే, పేదరికం అనేది దరిదాపులోకి రాదు.  చంద్రబాబు, మంత్రులు ఎప్పుడైనా నంద్యాల వచ్చారా? ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఇవ్వాళ చంద్రబాబు, మంత్రులు ఇక్కడే తిష్ట వేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు గారికి కుట్బు మిషన్లు గుర్తుకు వచ్చాయి..రైతులకు ట్రాక్టర్లు ఇస్తానంటున్నారు.  ఓటుకు ఐదు వేలు ఇస్తారట మరి ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో ఒక్కసారి గమనించండి.  అవన్నీ ప్రజల వద్ద నుంచి దోచిన సొమ్మే అని గుర్తు పెట్టుకోండి. 

ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయిఉంటే ఇక్కడకు చంద్రబాబు వచ్చేవారా? నంద్యాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చేవారా?. వైఎస్‌ఆర్‌ సీపీ పోటీ చేస్తుంది కాబట్టే చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. పాపానికి ఓటు వేయమని ఏ దేవుడు చెప్పడు. దెయ్యాలు మాత్రమే అలా చెబుతాయి.  

చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను, జాబుల పేరుతో యువకులను మోసం చేశారు. ఇలా అబద్ధాలతో చంద్రబాబు అందరినీ మోసం చేశారు. అబద్ధాలు చెబుతున్నారు. ఇవాళ జరిగేది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక. మీరందరూ ధర్మం వైపు నిలబడి ఓటు వేయండి.’  అని పిలుపునిచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: