చెదురుముదురు ఘర్షణలు మినహా కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక ముగిసింది. 65 శాతం వరకూ ఓటింగ్ నమోదైనట్టు ప్రాథమిక అంచనా. వర్షం పడుతుండడంతో ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని అర్థమవుతోంది. మొత్తం 48 వార్డులకు ఎన్నిక జరిగింది. సెప్టెంబర్ 1వ  తేదీ కౌంటింగ్ జరగనుంది.

Image result for kakinada

          కాకినాడ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంకోసం పాలక ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ పార్టీల నేతలు మోహరించి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం 48 వార్డుల్లో 241 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ 38 వార్డుల్లో, బీజేపీ 9 వార్డుల్లో, వైసీపీ 49 డివిజన్లలో పోటీ చేశాయి. టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ఇక్కడ రెబెల్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంది. కోర్టు కేసు దృష్ట్యా రెండు డివిజన్లలో ఎన్నిక జరగలేదు.

Image result for kakinada

          కాకినాడ కార్పొరేషన్ లో ఉదయం నుంచి ఓటింగ్ కు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉదయం నుంచి కొన్ని చోట్ల పార్టీల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. 10,11,12 డివిజన్లకు సంబంధించి ఒకే చోట పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయడంతో ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. మరికొన్నిచోట్ల తమ ఓటు హక్కు మిస్ అయిందంటూ ఓటర్లు అధికారులను నిలదీశారు.

Image result for kakinada

          38వ వార్డుల్లో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇది అక్రమమని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతృత్వంలో నిరసనకు దిగారు. ఎస్సై వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ సభ్యులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అప్పటికప్పుడు ఆయన్ను విధుల నుంచి తొలగించారు.

Image result for kakinada

          నంద్యాల ఉపఎన్నిక ప్రభావం కాకినాడలో కూడా కనిపిస్తుందని, ఓటర్లు పోటెత్తుతారని భావించిన పార్టీలకు నిరాశే ఎదురైంది. ఓటర్లు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే అధికార, ప్రతిపక్షాలు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  నంద్యాల ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. వైసీపీ మాత్రం అధికారపక్షానికి అడ్డుకట్ట పడడం ఖాయమంటోంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: