ఏదైనా సంఘటన జరిగితే దాన్ని కొండంత చేసి చూపించడంలో టీవీ ఛానళ్లు రెడీగా ఉంటాయి. శ్రీదేవి మరణవార్త తెలిసిన వెంటనే ఛానళ్లీ అదే అంశంపై వాలిపోయాయి. లోకల్, నేషనల్ ఛానల్స్ అనే తేడా లేకుండా అన్ని ఛానళ్లూ అదే బాటలో నడిచాయి. అయితే కొన్ని ఛానళ్లు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి..


          దుబాయ్ లో శ్రీదేవి ఆకస్మిక మరణం భారతీయ టీవీ చానళ్లకు పండగలా మారింది. నేషనల్ ఛానల్స్ అన్నీ ఇప్పటికే దుబాయ్ కి వెళ్లి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా తెలుగు లోకల్ ఛానల్స్ కూడా ఇన్ హౌస్ లో బాగానే సెట్టింగ్స్ వేసి చంపేస్తున్నాయి. ఇక రిపోర్టింగ్ విషయమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీదేవి దుబాయ్ లో చనిపోతే.. అక్కడ ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించేందుకు క్షణక్షణం పోటీపడ్డాయి. అక్కడే ఉండి రిపోర్టింగ్ చేస్తున్నట్టు భ్రమింపజేశాయి.


          మరికొన్ని ఛానళ్లయితే ఏకంగా బాత్ రూముల్లోనే లైవ్ డిస్కషన్లు పెట్టాయి. బాత్ రూమ్ సెట్టింగ్ లు క్రియేట్ చేసి లైవ్ బులిటెన్లు నడిపించేశాయి. నేషనల్ చానల్స్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. శ్రీదేవి బాత్ రూమ్ లోకి ఎలా వెళ్లింది.. ఎలా పడింది .. తొట్టిలో ఎలా మునిగి ఉంటుంది.. బాత్ రూమ్ లో బోనీ కపూర్ ఏం చేశాడు.. ఇలా.. ఎవరికి తోచిన స్టైల్ లో వాళ్లు ఆ సీన్ ను క్రియేట్ చేసి చూపించే ప్రయత్నం చేశారు.


          చివరి 15 నిమిషాల్లో ఏం జరిగిందనేదానిపై ఏబీపీ ఛానల్ సీన్ క్రియేట్ చేసింది. బూత్ రూమ్ లోని టబ్ పక్కన యాంకర్ నిల్చొని బులిటెన్ చేసింది. ఏమేం జరిగి ఉంటుందో వెల్లడించే ప్రయత్నం చేసింది. ఆజ్ తక్ కూడా సేమ్ సీన్ క్రియేట్ చేసింది. సీఎన్ఎన్ న్యూస్ 18 కూడా ఏం తగ్గలేదు. పరిశోధనాత్మక కథనం పేరుతో ఆర్కిమిడిస్ సూత్రాన్ని వివరించింది. రిపబ్లిక్ టీవీ మరో యాంగిల్ తీసుకుంది. అదే రకమైన స్టూడియోలను క్రియేట్ చేసింది. శ్రీదేవి మృతిని సునందా పుష్కర్ మృతితో పోల్చుతూ కథనాలను వండి వార్చింది.


ఈ ఛానళ్లను మించి పోటీ పడ్డాయి తెలుగు ఛానళ్లు. టీవీ9 ఈ విషయంలో కాస్త ముందుంది. ఏకంగా బాత్ టబ్ లోని నీళ్లలో శ్రీదేవి ప్రతిరూపాన్ని క్రియేట్ చేసింది. టబ్ లో శ్రీదేవి పడిపోయి ఉన్నప్పుడు బోనీ కపూర్ ఆ బాడీని చూస్తున్నట్టుగా సీన్ ను రీక్రియేట్ చేసింది. ఇక అన్నిటికంటే మించి జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకుంది మహా న్యూస్.  మహాన్యూస్ రిపోర్టర్ ఏకంగా బాత్ టబ్ లోకి దిగి ఏకంగా లైవ్ రిపోర్టింగ్ చేశాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకున్న ఛానల్ గా మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: