వేలమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏన్నో ఏళ్లుగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను వదులుకోవడానికి భారతీయ సమాజం అంత త్వరగా సిద్ధపడదు. కానీ ఎక్కడో ఒక చోట దీనికి బ్రేక్ పడాలి కదా..!? ఆచారం కావచ్చు, సంప్రదాయం కావచ్చు, మూఢ నమ్మకం కావచ్చు.. ఏదైతేనేం దీన్ని బ్రేక్ చేసిందో మోడల్.! తరతరాలుగా భారతీయ సంప్రదాయంలో భాగంగా వస్తున్న ఓ అంశంపై చర్చకు లేవనెత్తిందో ముద్దుగుమ్మ. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేసే చిన్న సంఘటనలు కొన్నిసార్లు పెద్ద సంచలనానికే కారణమవుతుంటాయి. ఇలాంటిదే ఇప్పుడు కేరళలో హల్ చల్ చేస్తోంది. అదిప్పుడు దేశానికంతటికీ పాకింది. తల్లి.. బిడ్డకు పాలివ్వడాన్ని కూడా నగ్నత్వంగా చూసే సమాజం మనది. అందుకే తల్లి పైటకొంగు అడ్డం పెట్టుకుని చంటిబిడ్డకు పాలిస్తుంటుంది.


మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేరళలోని ప్రముఖ మేగజైన్ గృహలక్ష్మి సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిపాలిచ్చే దృశ్యాన్ని చర్చకు పెట్టింది. బహిరంగంగా తల్లి పాలిస్తే అందులో అవమానకరంగా భావించాల్సింది ఏముందంటూ ప్రశ్నించింది. అందులో ఏమాత్రం తప్పులేదని, దాన్ని నగ్నత్వంగా భావించ కూడదని సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఇందుకోసం కొంతమంది బహిరంగంగా పాలిస్తున్న ఫోటోలను ప్రచురించింది. ఇందులో ఓ మోడల్ కూడా ఉంది.


వాస్తవానికి జనవరిలో అమృత అనే మహిళ తన ఒకటిన్నర నెలల వయసున్న బాబుకు పాలిస్తున్న ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అది కూడా తన భర్తకోసం..! అది ఫేస్ బుక్ లో సంచలనానికి కారణమైంది. అలా బరితెగించి ఎలా పోస్ట్ చేస్తారంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే అందులో తప్పేమందంటూ మరికొంతమంది సమర్థించుకుంటూ వచ్చారు. అమృత మాత్రం అందులో దాచాల్సిన అంశం ఏముందని ప్రశ్నించింది. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఓపెన్ గానే పాలిచ్చానని చెప్పింది. చాలా మంది అలా ఓపెన్ గా పాలివ్వడం వల్ల అవి ఎండిపోతాయని చెప్పారని అమృత వెల్లడించింది. అయితే అవన్నీ మూఢనమ్మకాలేనని, ఇప్పటి పిల్లలకు కూడా అవే మూఢనమ్మకాలను నూరిపోస్తున్నారని అమృత అభిప్రాయపడింది.


అప్పుడు మొదలైన చర్చ ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీసింది. తాజాగా గృహలక్ష్మి మేగజైన్ ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. గిలు జోసెఫ్ అనే మోడలో చంటిబిడ్డకు ఓపెన్ గా పాలిస్తున్న ఫోటోను కవర్ ఫోటోగా ప్రచురించింది. చంటిబిడ్డకు పాలివ్వడాన్ని అవమానంగా భావించాలా..? అని బహిరంగంగా ప్రశ్నించింది. గిలు జోసెఫ్ తో పాటు మరో గృహిణి ఫోటోను కూడా ఈ మేగజైన్ ప్రచురించింది. గిలు జోసెఫ్ మోడల్ మాత్రమే కాదు.. నటి, కవయిత్రి కూడా.! ఈ ఫోటోపై ఎన్ని విమర్శలొచ్చినా తాను సాదరంగా స్వాగతిస్తానని.. బహిరంగంగా బిడ్డలకు పాలిచ్చే తల్లులకు ఈ ఫోటోను అంకితమిస్తున్నట్టు గిలు జోసెఫో ప్రకటించింది.


పిల్లలు ఏడుస్తున్నా చాలా మంది తల్లులు పాలివ్వడానికి వెనకాడుతుంటారు. ఇందుకు కారణం బహిరంగంగా పాలివ్వడం ఇష్టం లేకనే.! దీంతో పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని, అప నమ్మకాలను మార్చాలనే ఉద్దేశంతోనే ఈ అంశంపై చర్చ లేవనెత్తినట్టు మేగజైన చీఫ్ ఎడిటర్ వెల్లడించారు. పాలివ్వడాన్ని తల్లి గర్వంగా భావించాలని, అందులో నామోషీగా భావించాల్సిందేమీ లేదని తెలిపారు. అంతేకాదు.. అలా ఫీలయ్యే తల్లులందరూ తమ బిడ్డకు పాలిస్తున్న ఫోటోలను షేర్ చేసుకోవడం ద్వారా మద్దతివ్వాలని కోరారు.


చంటిబిడ్డకు తల్లి పాలివ్వడాన్ని చాలా మంది చూపించరు. పైటకొంగు అడ్డం పెట్టుకుని ఇస్తుంటారు. లేదా ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి చాటుమాటుగా ఇస్తుంటారు. కొంతమంది యువతులు తమ వక్షోజాలను సెక్స్ అప్పీల్ కు సింబాలిక్ గా భావిస్తుంటారు. మరికొంతమందేమో షేమ్ గా ఫీలవుతుంటారు. కానీ అవే వక్షోజాలు ప్రపంచంలో కోట్లాది మంది చిన్నారులకు ఆకలి తీరుస్తున్నాయి. ఎంతోమంది తల్లులను దేవతలుగా మారుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: