తెలంగాణలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతల సతీమణులు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. తమ భర్తల అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నికల బరిలోకి  దిగబోతున్నారు. ప్రజాక్షేత్రంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సతీమణి  రాజకీయ రంగ ప్రవేశం ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర  మంత్రి  ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Image result for trs

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనను కరీంనగర్‌ పార్లమెంటు స్థానానికి పోటీ చేయించాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజేందర్ సతీమణి జమునను టీఆర్ ఎస్ నుంచి బరిలో దించుతారనే ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే కరీంనగర్‌ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థని రంగంలోకి దింపాలని టీఆర్ ఎస్ భావిస్తోంది. అందుకు పార్టీలో సీనియర్ నేత అయిన ఈటల రాజేందరే సమర్థుడని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. 

Image result for trs

ఈ క్రమంలోనే ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చిన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన వారసురాలుగా సతీమణి జమునను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మరోపక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లా వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన భార్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు.  వచ్చే ఎన్నికల్లో ఆమెను  పోటీ చేయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తనకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం కోసం  వెతుకుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. 


ఇందుకోసం వరంగల్‌ పార్లమెంటు స్థానాన్ని వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కే ఆయన ఎసరు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా  వరంగల్ ఎంపీ టికెట్ ను తన భార్యకు ఇప్పించేందుకు ఎమ్మెల్యే రమేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క మాజీ డిప్యూటీ సీఎం , స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రమేశ్ తన సతీమణిని టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: