జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి షిఫ్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ సమీపంలో కొత్త ఇంటి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేసారు. శాస్త్రోక్తంగా భార్య అన్నా లెజినోవాతో కలిసి నూతన గృహ నిర్మాణానికి సంబంధించి పూజలు నిర్వహించారు. మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్పవం కోసం చేస్తున్న ఏర్పాట్లను సైతం పవన్ పరిశీలించారు.


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. సాహితి అనే నిర్మాణ సంస్థ ఈ ఇంటిని నిర్మిస్తోంది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి భూమి పూజ చేశారు. సుమారు రెండెకరాల స్థలంలో ఈ ఇంటిని నిర్మించచనున్నారు. ఇంట్లో అత్యసవరంగా పార్టీ సమావేశాలను నిర్వహించుకునేందుకు వీలుగా నిర్మాణం చేపట్టనున్నారని తెలుస్తోంది. ఆరునెలల్లో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇచ్చేలా సంస్థ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.


పవన్ పార్టీ స్థాపించి నాలుగేళ్లయిన సందర్భంగా 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళగిరి లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వేదికపై 100 అడుగుల భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. వేదిక కనిపించేలా సభా ప్రాంగణమంతా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలు ఏర్పాటు చేసి అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.


14న జరగనున్న సభా వేదిక నుంచే పవన్ తన రాజకీయ ప్రణాళిక వెల్లడించనున్నారు. అదే విధంగా పార్టీ కార్యాచరణ వివరించనున్నారు. దీంతో పవన్ సభపై పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: