చంద్ర‌బాబునాయుడుకు అంత స‌త్తా ఉందా ? అన్న ప్ర‌శ్నే ఇపుడు రాష్ట్రంలోని రాజ‌కీయ‌పార్టీల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ స‌త్తా ఏంట‌నేగా మీ సందేహం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశంపార్టీకే రాష్ట్రంలోని 25 ఎంపి సీట్ల‌నూ క‌ట్ట‌బెడితే ప్ర‌ధాన‌మంత్రి ఎవ‌ర‌నేది తానే నిర్ణ‌యిస్తాన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇక్క‌డే చంద్ర‌బాబు మాట‌ల‌పై అంద‌రికీ సందేహం వ‌స్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ  కూడా  అధికార‌ప‌క్షం  ఖాతాలో 20 ఎంపి స్ధానాలుండేవి. అంటే మిత్ర‌ప‌క్షమైన‌ బిజెపికి రెండు స్ధానాలు,  ప్ర‌తిప‌క్షమైన‌ వైసిపి ఫిరాయింపు ఎంపిలు ముగ్గురు క‌లుపుకునే లేండి.  మారిన రాజ‌కీయ ప‌రిస్దితుల్లో మిత్ర‌ప‌క్షంగా బిజెపి ప‌క్క‌కు త‌ప్పుకున్న త‌ర్వాత రెండు ఎంపి స్ధానాలను తీసేస్తే ఇపుడు కూడా టిడిపి ఖాతాలో 18 ఎంపిలున్న‌ట్లే. 18 ఎంపిల బ‌లమంటే మామూలు విష‌య‌మేమీ కాదు.  అయినా చంద్ర‌బాబు సాధించిన‌దేంటి  ?


మొన్న‌టి వ‌ర‌కూ ఏం సాధించారు ?
పైగా చంద్ర‌బాబు మొన్న‌టి వ‌ర‌కూ ఎన్డీఏలో భాగ‌స్వామే క‌దా ? అందులోనూ కేంద్ర‌ప్ర‌భుత్వంలో ఇద్ద‌రు టిడిపి ఎంపిల‌కు మంత్రిప‌ద‌వులును కూడా ఇప్పించుకున్నారు క‌దా ? అయినా ఉప‌యోగ‌మేమ‌న్నా క‌న‌ప‌డిందా ?  మిత్ర‌ప‌క్షం హోదాలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌ల‌ని ముఖ్య‌మంత్రి, విభ‌జ‌న చ‌ట్టాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు చేయించ‌లేని వ్య‌క్తి రేపు 25 ఎంపి స్ధానాలనూ  టిడిపికే క‌ట్ట‌బెట్టినంత‌మాత్రాన చేయ‌గ‌లిగేది ఏముంటుంది ?  రాజ‌కీయ‌పార్టీల‌ను, సామాన్య జ‌నాల‌ను ఇపుడు వేధిస్తున్న ప్ర‌శ్న ఇదే.


ఉత్త‌రాధిని కాద‌ని చంద్ర‌బాబుకు అవ‌కాశ‌మా ? 
చంద్ర‌బాబు మాట‌లే నిజ‌మ‌నుకుందాం. అపుడు మాత్రం ఏమ‌వుతుంది ? ఎందుకంటే, ఏపిలో ఉన్న 25 పార్ల‌మెంటు స్ధానాల‌క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఎంపిలున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. త‌మిళ‌నాడులో 39 స్ధానాలు, ప‌శ్చిమ‌బెంగాల్లో 42 స్ధానాలు, బీహార్ లో 40 స్ధానాలు, మ‌హారాష్ట్రలో 48, మ‌ధ్య‌ప్ర‌దేశ్లో 29, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 80 స్ధానాలున్నాయి. అంటే, పై రాష్ట్రాల‌న్నింటిలోనూ ఏపిలోని 25 స్ధానాల‌క‌న్నా ఎక్కువ ఎంపి సీట్లున్నాయ‌న్న విష‌యం అర్ధ‌మవుతోంది క‌దా ?  పైగా పై రాష్ట్రాల్లో త‌మిళ‌నాడును ప‌క్క‌న‌పెడితే మిగిల‌నవ‌న్నీ ఉత్త‌రాది రాష్ట్రాలే అన్న విష‌యం గ‌మ‌నించాలి.  అటువంట‌ప్పుడు ఉత్త‌రాదిలోని రాష్ట్రాల‌న్నింటినీ కాద‌ని ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్ధి ఎవ‌రో నిర్ణయించే అవ‌కాశం చంద్ర‌బాబుకే  ఎలా ద‌క్కుతుంది? 


ఎంపిల‌న్నీ ఇచ్చిన సేమ్ సీనే రిపీట్ ? 
అంటే,  వాస్తవాల‌ను ప‌రిశీలిస్తే చంద్ర‌బాబు మాట‌ల‌న్నీ ఉత్త డొల్లే అన్న విష‌యం అర్ధ‌మైపోతోంది. కాక‌పోతే జ‌నాలు 25 ఎంపి సీట్లనూ టిడిపికే క‌ట్ట‌బెడితే వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబుకేమైనా లాభం ఉంటుందేమో కానీ రాష్ట్రానికి మాత్రం కాద‌న్న విష‌యం వాస్త‌వం. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడితో  సంబంధాలు బాగున్న‌పుడే చంద్ర‌బాబు కేంద్రం నుండి ఏమీ సాధించ‌లేక‌పోయారు. అటువంటిది కేంద్రానికి, చంద్ర‌బాబుకు మ‌ధ్య సంబందాలు పూర్తిగా క్షీణించ‌న త‌ర్వాత సాధించ‌గ‌లిగేది కూడా ఏమీ ఉండ‌దు. ఒక‌వేళ ఎన్డీఏనే మ‌ళ్ళీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినా, రాష్ట్రంలో చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రి అయితే ఏమ‌వుతుంది ? ఏమీ కాదు. మొన్న‌టి నాలుగేళ్ళ‌కాలాన్ని ఎలా నెట్టుకొచ్చారో అదే సీన్ మ‌ళ్ళీ రిపీట్ అవుతుంది అంతే. ఎవ‌రికైనాఎనీ డౌట్ ?


మరింత సమాచారం తెలుసుకోండి: