తెలంగాణాలో టీడీపీ పరిస్థితి అధ్వానంగా తయారయింది. ఒకప్పుడు అధికారం చేపట్టి ఓ వెలుగు వెలిగిన పార్టీ నేడు ఉనికి కోసం పాట్లుపడుతోంది. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో క్యాడర్లో కలవరం నెలకొంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో దారితోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వాస్తవానికి ప్రత్యేక  రాష్ట్ర ఉద్యమం తీవ్రమైనప్పటి నుంచి తెలంగాణలో టీడీపీ పతనం ప్రారంభమైంది. అధినేత చంద్ర‌బాబు వైఖరితో విసుగుచెంది చాలా మంది అగ్రనేతలు ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. 

Image result for tdp

ఇన్నాళ్లు పార్టీలో, ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు అనుభ‌వించి త‌మ భవిష్య‌త్ కోసం మ‌రికొంద‌రు ఇత‌ర పార్టీలు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీటీడీపీ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందా? లేక పొత్తులతో బరిలో నిలుస్తుందా? అన్నది అంతుబ‌ట్ట‌డం లేదు. సొంతంగా పోటీ చేస్తే ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని పొత్తులతోనైనా కొన్ని సీట్లు గెలుపొంది పరువు నిలుపుకోవాలని పార్టీ రాష్ట్ర‌ నాయకత్వం భావిస్తోంది. 

Image result for revanth reddy

నిజానికి పార్టీ పొత్తుల అంశంపై సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టీఆర్ ఎస్ తో టీడీపీ జతకడితే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మరోపక్క టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరివాదన ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పొత్తుల అంశంపై ఆచితూచి వ్యవహారిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన టీఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి తీవ్ర‌ వ్యతిరేకత ఏర్పడుతుందని, ఫలితంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంటుందని భావిస్తున్నారు. 

Image result for motkupalli narasimhulu

మరోపక్క కాంగ్రెస్ తో జట్టుకడితే ఏపీలో పార్టీకి తీవ్రనష్టం తప్పదని రాజ‌కీయ‌ విశ్లేషకులు భావిస్తున్నారు.  టీడీపీ, కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందని, ఏపీ సీఎం చంద్రబాబు,  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో కలిసి వేదిక పంచుకోవడం ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. ఏదేమైనా ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇప్పుడే పొత్తులపై తొందరపడొద్దని చంద్రబాబు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే అప్ప‌టి ప‌రిస్థితుల ఆధారంగా పొత్తుల అంశంపై నిర్ణయం తీసుకోవ‌డ‌మే మేలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: