నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నవ నిర్మాణ దీక్షలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. విభజనలో రాష్ట్రానికి అన్యాయం జరిగిన నేపథ్యంలో అవతరణ దినోత్సవం బదులు ఏటా నవ నిర్మాణ దీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈసారి కూడా విజయవాడలో జరిగే నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. వారం రోజులపాటు ఇవి జరగనున్నాయి.

 Image result for నవ నిర్మాణ దీక్ష

విభజనానంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాల్సి ఉంది. అయితే విభజనలో నవ్యాంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైందని, ఈ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సరికాదనే ఉద్దేశంతో ప్రజలను రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా సన్నాహ పరిచేందుకు నవనిర్మాణ దీక్షలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రజలను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసి.. మరింత ముందుకు తీసుకెళ్లాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం.

 Image result for నవ నిర్మాణ దీక్ష

2015 నుంచి ప్రతిఏటా నవనిర్మాణ దీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. ఏటా వారం రోజులపాటు జరిగే ఈ దీక్షల్లో ఒక్కో రోజును ఒక్కో అంశానికి కేటాయించారు. జూన్ 2న విభజన చట్టం- అమలు తీరు, జూన్ 3న నీటి భద్రత – కరువు రహిత రాష్ట్రం, జూన్ 4న రైతు సంక్షేమం – ఆహార భద్రత, జూన్ 5న సంక్షేమం – సాధికారత, జూన్ 6న ఉపాధి కల్పన- జన్మభూమి, జూన్ 7న మౌలిక సదుపాయాలు – మెరుగైన జీవనం, జూన్ 8న మహా సంకల్పం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో పాల్గొనే విధంగా షెడ్యూల్ రూపొందించారు. ప్రతిరోజూ జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ముఖ్యమంత్రి నేతృత్వంలో గ్రామసభ నిర్వహిస్తారు. తొలిరోజు విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగే కార్యక్రమంలో ప్రజలచేత మహాసంకల్ప దీక్ష చేయించనున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధితో పాటు సాధించాల్సిన ప్రగతిని ప్రజలకు వివరించనున్నారు.

Image result for నవ నిర్మాణ దీక్ష

ఈసారి నవనిర్మాణ దీక్షల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిపోయి కేంద్రం కుట్ర రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈసారి ఈ వేదికలను కేంద్రంపై విమర్శలకు, తాము చేసిన అభివృద్ధికి ప్రచారాస్త్రాలుగా మార్చుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఈ దీక్షలను నవ నిర్మాణ దీక్షలు అనడం కంటే ప్రచారదీక్షలు అనడం బెటరేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: