కొత్త రాజకీయం చేస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ చుట్టూ పాత రాజకీయమే పచార్లు కొడుతోంది. మరీ ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ మాజీ నాయకులే ఇక్కడా కనిపిస్తున్నారు. వారే ఫ్రెష్ గా కండువాలు కప్పుకుంటూ షో చేస్తున్నారు. దీంతో పవన్ ప్రవచించిన కులాతీతమైన రాజకీయం మటుమాయమై ఆ ఒక్క కులమే ఎంచక్కా అక్కడ కనిపిస్తోంది. ఈ ప్రయోగం చూడబోతే ప్రజా రాజ్యం టూ అవుతున్నట్లుగా ఉందంటున్నారు.

చేరిన వారంతా వారేనా :

పవన్ విశాఖ టూర్లో  తాజాగా పార్టీ కండువాలు కప్పుకున్న వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య, కార్మిక నాయకుడు బండారు సూర్య ప్రకాష్, క్రీడా కారిణి చిక్కాల ఉషశ్రీ,కాంగ్రెస్ మాజీ నేత బాల సతీష్ ఇలా అంతా పవన్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం విశేష పరిణామమే. సరిగ్గా ఇదే తీరులో నాడు జోరు చూపించిన కాపు నాయకులు ప్రజారాజ్యం పార్టీలో వేరెవరికీ చోటు లేదనిపించేలా ఓవరాక్షన్ చేశారు.

చెబుతున్న దానికి భిన్నంగా :

ఇక పవన్ నియమించిన అధికార ప్రతినిధులు, జనసేన పేరు చెప్పుకుని పత్రికా  ప్రకటనలు ఇస్తున్న వారు, ఆయన పక్కన నిలబడుతున్న వారు సైతం అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడం యాధ్రుచ్చికం కాబోదు. తనకు కులం లేదని, మతం అంతకంటే లేదని పదే పదే చెప్పుకుంటున్న పవన్ ఈ కులం గబ్బుని ఎలా భరిస్తున్నారో మరి. ఏపీ రాజకీయలంటేనే కులాల కుమ్ములాట, అలాగని ఒకే కులానికి ఏ పార్టీ కూడా అదీ బాహాటంగా పెద్ద పీట వేయడమన్నది కుదిరే వ్యవహారం కాదు. కానీ అక్కడే ప్రజారాజ్యం తప్పటడుగు వేసింది. మరి పవన్ కూడా జాగ్రత్త పడకపోతే ఆ సంకేతాలే జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది.

అందరినీ ఆకట్టుకుంటేనే...:

పవన్ కు ఈ రోజు వరకూ కేవలం సినిమా గ్లామర్ మాత్రమే ఉంది. జన నాయకుడిగా ఎదగాలంటే అందరి మన్ననలూ పొందాలి. అంతే కాదు. పది మందినీ కలుపుకుని ముందుకుపోవాలి. పవన్ వరకూ చూసుకుంటే అలాగే ఆలోచిస్తారనుకున్నా ఆచరణలో మాత్రం తేడా కొడుతోంది. ఇది మా పార్టీ అంటూ జబ్బలు చరచుకుని ఒక సామాజిక వర్గం చేస్తున్న దందాను మొగ్గలోనే తుంచివేయకపోతే జనసేనకు భారీగానే నష్టం జరిగిపోతుంది. నిజంగా ఆ కులంలోని వారు పవన్ పెద్ద నాయకుడిగా ఎదగాలని కోరుకుంటే వారు వెనక నుండి ఇతర సామాజిక వర్గాలను ఎంతగా వీలుంటే అంతలా ప్రోత్సహిస్తే జనసేన పది కాలాలు మనగలుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: