బీజేపీ పూర్వ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు  మౌన మునిగా పేరు బాగానే  సంపాదించుకున్నారు. మిన్ను విరిగి మీద పడ్డా ఆయన చలించరు సరికదా కించిత్తైనా స్పందించరు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద అనంతపురంలో దాడి జరిగినా ఈ మాజీ అధ్యక్షుడి నోటి వెంట అయ్యో అన్న ఒక్క మాట కూడా రాలేదు.



టీడీపీని పల్లెత్తు మాట అనరుగా :



తెలుగుదేశం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్న వారిలో ఈ బీజేపీ నేత ముందు వరసలో ఉంటారు. చంద్రబాబుపై ఇంతవరకూ ఒక్క పరుషపదమైనా అనని ఉత్తమోత్తమ మిత్రుడు హరిబాబు. నిత్యం ప్రధాని మోడీని నోటికొచ్చినట్లుగా టీడీపీ పెద్దలు తిడుతున్నా, ఆ మధ్యన అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినా హరిబాబు మౌనంతోనే సరిపెట్టేశారు.



ఇపుడూ అదే తీరు : 



కన్నాపై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలని తెలుసు, ఏపీలో  మిత్ర బంధం తెగిందనీ తెలుసు, సాటి బీజేపీ నాయకులు టీడీపీపై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారని తెలుసు, అయినా ఆయన మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. యధాప్రకారం మౌనమే నా భాష అంటున్నారు. 



కమలదళం గుస్సా :



పార్టీలోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ కామెంట్స్ తో పాలిట్రిక్స్ ని తన వైపు తిప్పుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజుగారు బాబును బాగానే ఆడిపోసుకున్నారు. ఇదేం విధానమంటూ రెచ్చిపోయారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే టీడీపీ కార్యకర్తలను  గూండాలతో పోల్చేశారు. మీ దాడులకు భయపడమంటూ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇంత జరిగినా  హరిబాబు పెదవి విప్పకపోవడాన్ని మాత్రం అంతా తప్పు పడుతున్నారు.



అన్నీ అనుభవించి ఇలానా :



బీజేపీ ద్వారా ఎన్నో పదవులు, ప్రయోజనాలు పొందిన హరిబాబు పార్టీని వెనకేసుకుని గట్టిగా మాట్లాడకపోవడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ పెద్దలందరిపై మాటల దాడులే కాదు, భౌతిక దాడులకు దిగుతున్నా కిమ్మనకపోవడం ధర్మమేనా అంటోంది. ఇదే తీరున బడా నేతలు ఉండబట్టే ఏపీలో బీజేపీ మట్టి కొట్టుకుపోయిందంటూ సెటైర్లూ వేస్తోంది. ఇలా ఎవరెన్ని అన్నా అనుకున్నా అయన  మాత్రం పెదవి విప్పరంటే విప్పరు, ఎందుకంటే మౌన ముని కదా


మరింత సమాచారం తెలుసుకోండి: