ఆ ఇద్ద‌రు నేత‌లూ తెలుగుదేశంపార్టీ దుమ్ము దులిపేస్తున్నారు. ఇంత కాలం ఎదుటివాళ్ళ‌పైన బుర‌ద‌చ‌ల్ల‌టం, దుమ్మెత్తిపోయ‌ట‌మే టిడిపి ప‌నిగా పెట్టుకుంది. ఇపుడు సీన్ రివ‌ర్స్ అవుతుంటే త‌ట్టుకోలేక‌పోతోంది.  టిడిపికి ఒక విధంగా చుక్క‌లు చూపిస్తున్న ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రో ఈ పాటికే అర్ధ‌మైపోయుంటుంది. వారే భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన జివిఎల్ న‌ర‌సింహారావు, సోము వీర్రాజు.  చంద్ర‌బాబునాయుడుతో క‌లిపి మొత్తం టిడిపి నేత‌ల‌పై అదే ప‌నిగా ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 


రంగంలోకి దిగిన జివిఎల్

Image result for gvl narasimha rao

నాలుగేళ్ళ‌పాటు క‌లిసి కాపురం చేసిన‌ బిజెపి-టిడిపిలు  ఈ మ‌ధ్యే  విడిపోయిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అప్ప‌టి నుండి కేంద్ర‌ప్ర‌భుత్వం లేదా బిజెపి కేంద్ర నాయ‌క‌త్వం త‌ర‌పున జివిఎల్ న‌ర‌సింహారావు రంగంలోకి దిగారు. ప్ర‌ధాన‌మంత్రికి అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రైన జివిల్ రాజ్య‌స‌భ స‌భ్యుడు కూడా. ఏపికి చెందిన నేతే అయిన‌ప్ప‌టికీ ఇక్క‌డి  రాజ‌కీయాల‌తో పెద్ద‌గా సంబంధాలు లేవ‌నే చెప్పాలి.  ఎప్పుడైతే బిజెపి-టిడిపిలు విడిపోయాయో వెంట‌నే కేంద్ర నాయ‌క‌త్వం జివిఎల్ ను రంగంలోకి దింపింది. 


జివిఎల్ ఆరోప‌ణ‌ల‌పై జ‌నాల్లో చ‌ర్చ‌


చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని జివిఎల్ వ‌రుస‌గా చేస్తున్న‌ ఆరోప‌ణ‌లు జ‌నాల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. జివిఎల్ ఆరోప‌ణ‌ల్లో ఎంత వ‌ర‌కూ వాస్త‌వాలున్నాయ‌న్న‌ది వేరే సంగ‌తి.  ముందైతే చంద్ర‌బాబుపై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు టిడిపి నేత‌లు స‌మాధానిలివ్వాల్సొస్తోంది క‌దా ?  తాజాగా జివిల్ చేసిన 53 వేల కోట్ల పిడి ఖాతాల కుంభ‌కోణంపై ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు గ‌డ‌చిన వారం రోజులుగా జ‌నాల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది క‌దా ?  బిజెపికి కావాల్సింది కూడా అదే. చంద్ర‌బాబు నీతిమంతుడ‌ని ఎవ్వ‌రూ అన‌టం లేదు. కాక‌పోతే చంద్ర‌బాబుపై రాజ‌కీయంగా ఆరోప‌ణ‌లు చేసేవారే కానీ ఆర్దిక అంశాల‌పై ఎండ‌గ‌ట్టిన వారు పెద్ద‌గా లేర‌నే చెప్పాలి.  ఆ లోటును జివిఎల్ భ‌ర్తీ చేసి జ‌నాల్లో చ‌ర్చ జ‌రిగేట్లు చేస్తున్నారు.


రెచ్చిపోతున్న వీర్రాజు

Related image

ఇక‌, సోము వీర్రాజు గురించి అంద‌రికీ తెలిసిందే. బిజెపి-టిడిపిలు విడిపోక‌ముందు నుండే చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకున్నారు.  రెండు పార్టీలు విడిపోయిన త‌ర్వాత వీర్రాజు  మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. అయితే వీర్రాజు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో లాజిక్ క‌న్నా శ‌బ్ద‌కాలుష్య‌మే ఎక్కువ‌గా ఉంటోంది.  అందుక‌నే  వీర్రాజు ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉంద‌నుకున్నా  పెద్ద‌గా విలువ లేకుండా పోతోంది. నీరు చెట్టు, వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణం లాంటి అనేక ప‌థ‌కాల్లో అవినీతి జ‌రుగుతోందంటూ వీర్రాజు ఎప్ప‌టి నుండో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. 


మిగిలిన నేత‌లేం చేస్తున్నారు ?


విచిత్ర‌మేమిటంటే, చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని పై ఇద్ద‌రు నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నా వారికి పార్టీలోని ఇత‌ర నేత‌ల‌ నుండి పెద్ద‌గా మ‌ద్ద‌తు దొర‌క‌టం లేదు. పురంధేశ్వరి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాణిక్యాల‌రావు, ఆకుల సత్య‌నారాయ‌ణ‌, విష్ణుకుమార్ రాజు లాంటి నేత‌లు చాలా మందే ఉన్న‌ప్ప‌టికీ  ఎందుక‌నో చంద్ర‌బాబు అండ్ కో పై   వ్య‌తిరేకంగా అంత యాక్టివ్ గా ఉన్న‌ట్లు అనిపించ‌టం లేదు.  స‌రే ఏదేమైనా ఇద్ద‌రు నేత‌ల‌తోనే టిడిపి ఇబ్బంది ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం. ఇంత కాలం ఎదుటివారిపై బుర‌ద చ‌ల్ల‌ట‌మే తెలిసిన టిడిపికి ఇపుడు త‌మ‌పై ప‌డుతున్న బుర‌ద‌ను తుడుచుకోవ‌టం పెద్ద ప‌నైపోయింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డేస‌మ‌యానికి ఈ బుర‌ద చ‌ల్లుడు కార్య‌క్ర‌మం ఏ స్ధాయికి వెళుతుందో చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: