ఏపీ, తెలంగాణ‌ల్లో రాజ‌కీయ వ్యూహాలు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నాయ‌కులు త‌మ త‌మ పంథాల్లో ముందుకు సాగుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్రాన్ని విడ‌దీసిందనే కార‌ణంగా కాంగ్రెస్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జమెత్తిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆ పార్టీకి వంత పాడుతున్నారు., పైకి లేదం టూనే లోలోన ఆయ‌న కాంగ్రెస్‌కు అనుకూలంగా రాజ‌కీయాలు నెరుపుతున్నారు. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే..  ఇక్క‌డ అధికార పార్టీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ నిన్న మొన్న‌టి వ‌ర‌కు తిట్టిపోసిన బీజేపీతో క‌లిసి ముందుకు సాగేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. 

Image result for hari prasad jdu

ఇటీవ‌ల ఏపీ అధికార పార్టీ ఎంపీలు పార్ల‌మెంటులో  ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌.. త‌నమ‌నసులో మాట‌ల‌ను చెప్పక‌నే చెప్పారు. చంద్ర‌బాబు క‌న్నా ప‌రిణితి ఉన్న నాయ‌కుడు కేసీఆర్ అంటూ పార్ల‌మెం టులోనే పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. నిజానికి ఈ ఊహించ‌ని ప‌రిణామం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. ఇక‌, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఇక‌, ఇప్పుడు పెద్ద‌ల స‌భ రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లోనూ ఈ రెండు పార్టీలు వ్య‌వ‌హ‌రించిన తీరు.. వాటి నైజాన్ని బ‌య‌ట‌పెట్టింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ఎన్నిక ద్వారా ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా తేలిపోయినట్లు అయింద‌ని చెబుతున్నారు. 

Image result for hari prasad jdu

ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ  డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి హరిప్రసాద్ కు ఓటు వేసింది. గత కొంత కాలంగా ఎన్డీయేతో విభేదిస్తున్న టీడీపీ క్రమక్రమంగా కాంగ్రెస్ కు దగ్గర అవుతూ వస్తోంది. కొద్ది రోజుల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణతో పాటు ఏపీలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగానే అన్నట్లు రాజ్యసభలో ఆ పార్టీ తీరు ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం అసలు బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశానికి దశ..దిశా చూపిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బీజేపీకి దగ్గర అయినట్లు  ఈ ఎన్నికతో స్పష్టంగా తేలిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలోనూ అదే స్పష్టమైంది. ఎన్డీయే బలపర్చిన అభ్యర్ధికే టీఆర్ఎస్ సభ్యులు ఓటు వేశారు. దీంతో కెసీఆర్ ఎటువైపు ఉన్నది స్పష్టమైపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భవిష్యత్ రాజకీయాలకు ఇవి సంకేతాలకు నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. హరివంశ్ నారాయణ్ జెడీయూ ఎంపీ అయిన అధికార ఎన్డీయే బలపర్చిన అభ్యర్ధి కావటంతో బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు అయింది. సో..తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ కాంగ్రెస్ తో జట్టుకట్టగా, టీఆర్ఎస్ బీజేపీతో కలసినట్లు అయింది.  మ‌రి ఈ నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌ల్లో రాజ‌కీయాలు ఏ దిశ‌గా ముందుకు వెళ్తాయో స్పష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: