ముందుగా అనుకున్నట్టుగానే తుఫాన్  సినిమా విడుదల ఖాయమైంది. సెప్టెంబర్ ఆరో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా..  రామ్ చరణ్ సొంత రాష్ట్రంలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో.. అనేది అంతుబట్టని వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో, మెగాస్టార్ వ్యవహరణ తీరులో ఉన్న లోపాలతో చరణ్ సినిమాకు అటు తెలంగాణ ప్రాంతంలోనూ, ఇటు సీమాంధ్రలోనూ కష్టాలు తప్పేలా లేవు! ప్రస్తుతం అందరి రాజకీయనాయకులపై ఒక ప్రాంతంలో మాత్రమే ప్రజాగ్రహం ఉంది. కానీ మెగాస్టార్ పై మాత్రం ఉభయ ప్రాంతాల ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. అదే ఇప్పుడు చరణ్ సినిమాకు ప్రతిబంధంకంగా మారుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడం లేదు. ఇది సీమాంధ్ర ప్రాంతంలో ఆయనపై ప్రజాగ్రహం ఏర్పడటానికి కారణం. చిరంజీవి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రకటనతో తెలంగాణ ప్రాంత ప్రజలను శత్రువులను చేసుకున్నాడు! ఈ విధంగా రెండు ప్రాంతాల ప్రజలతో సున్నం పెట్టుకున్నాడు చిరంజీవి. దీంతో చరణ్ సినిమాపై రెండు ప్రాంతాల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. చిరంజీవి తీరుపై పెల్లుబికిన వ్యతిరేకత చరణ్ సినిమా కలెక్షన్లపై ప్రభావితం చేస్తోంది. 

ఓవరాల్ గా తన మంత్రి పదవి మీద మమకారంతో ఎవరికీ కాని వాడు అయిపోయాడు 'అందరివాడు'. తుఫాన్ విడుదల అయితే.. తెలంగాణ వాదం, సమైక్యవాదం థియేటర్ల వద్దకు వస్తుంది. మెగాభిమానులు అటు సమైక్యవాదులతోనూ, ఇటు తెలంగాణ వాదులతోనూ తలపడాల్సి ఉంటుంది. ఈ విధంగా చరణ్ సినిమా రాష్ట్రంలో రచ్చ లను రేపబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: