ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొద్దీ నేత‌ల మ‌ధ్య వివాదాలు,  స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవ్వాల్సింది పోయి మ‌రింత పెర‌గ‌ట‌మే కాకుండా కొత్త కుంప‌ట్లు రాజుకుంటున్నాయి. తాజాగా క‌ర్నూలు జిల్లాలో కొత్త‌గా మొద‌లైన వివాద‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇప్ప‌టికే క‌ర్నూలు జిల్లాలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఎల్ఏలు, నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఉన్న గొడ‌వ‌లు చాల‌వ‌న్న‌ట్లు కొత్తగా శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ఎన్ఎండి ఫ‌రూక్-మంత్రి అఖిల‌ప్రియ వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు ర‌చ్చ‌కెక్క‌టం గ‌మ‌నార్హం.


మూడు వ‌ర్గాలు ఆరు వివాదాలు


జిల్లాలో ఇప్ప‌టికే  ఎంఎల్ఏలు, నేత‌ల మ‌ధ్య మూడు వ‌ర్గాలు, ఆరు వివాదాలుగా ఉంది పార్టీ ప‌రిస్దితి. ఆళ్ళ‌గ‌డ్డ‌లో, నంద్యాల‌లో ఫిరాయింపు మంత్రి అఖిల‌ప్రియ‌కు, సీనియ‌ర్ నేత ఏవి సుబ్బారెడ్డికి ఏమాత్రం ప‌డ‌టం లేదు. రెండు వ‌ర్గాలు ఎదురుప‌డితే రాళ్ళ వ‌ర్షం కురిపించుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆళ్ళ‌గ‌డ్డ నుండి పోటీ చేయాల‌ని ఏవి ప్ర‌య‌త్నిస్తుండ‌ట‌మే వివాదానికి మూల కార‌ణం. త‌న‌కు టిక్కెట్టు రాక‌పోతే మంత్రి ఎలా గెలుస్తుందో చూస్తానంటూ ఏవి బ‌హిరంగంగానే స‌వాలు విసురుతున్నారు. నంద్యాల‌లో ఉంటున్న ఏవికి ఆళ్ళ‌గడ్డ‌లో కూడా బ‌ల‌ముండ‌టంతో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.


అఖిల‌కు ఎవ‌రితోనూ ప‌డ‌టం లేదు

Image result for akhila priya mla

ఇక‌, బ‌న‌గానిప‌ల్లె ఎంఎల్ఏ బిసి జ‌నార్ధ‌న్ రెడ్డి కాంట్రాక్టుల్లో అఖిల వేలు పెట్టింది. దాంతో వాళ్ళిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. చివ‌ర‌కు ఈ పంచాయితీ చంద్ర‌బాబునాయుడు దాకా వెళ్ళినా ఏమీ తేల‌లేదు. ఉప ముఖ్య‌మంత్రి కెఇ కృష్ణ‌మూర్తి-అఖిల‌కు కూడా ఏమాత్రం ప‌డ‌దు. కాక‌పోతే ఎందుక‌నో అఖిల ప్ర‌త్య‌క్ష‌గా కెఇ వ‌ర్గంతో పెట్టుకోవ‌టం లేదు. నంద్యాల ఫిరాయింపు ఎంపి ఎస్పీవై రెడ్డితో కూడా అఖిల‌కు ఏమంత స‌ఖ్య‌త లేదు. కాబ‌ట్టి ఎవ‌రి గొడ‌వ వాళ్ళ‌దే. 


క‌ర్నూలు అసెంబ్లీ స్ధానంలోనూ గొడ‌వ‌లే


క‌ర్నూలు కేంద్రంలో ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వి మోహ‌న్ రెడ్డికి రాజ్య‌స‌భ స‌భ్యుడు టిజి వెంక‌టేష్ వ‌ర్గాల‌కు ఉప్పు-నిప్పులాగుంది ప‌రిస్దితి.  ఇద్ద‌రిలో ఎవ‌రికి టిక్కెట్టు వ‌చ్చినా రెండో వాళ్ళ వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌టం ఖాయం. అదేవిధంగా ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుక‌కు  పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏ ఒక్క ఎంఎల్ఏ కూడా స‌హ‌క‌రించ‌టం లేదు. ఈ గొడ‌వ‌ల‌న్నింటిపైన చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు నేత‌ల‌తో మాట్లాడుతునే ఉన్నారు. అవ‌స‌ర‌మైన వాళ్ళ‌కు ఫుల్లుగా క్లాసులు పీకుతునే ఉన్నారు. అయినా ఎవ‌రు చంద్ర‌బాబు మాట విన‌టం లేదు. 


ఫ‌రూక్-అఖిల మ‌ధ్య కొత్త వివాదం

Image result for akhila priya and farooq

ఈ స‌మస్య‌లు ఇలా వుండగా కొత్త‌గా శాస‌న‌మండ‌లి  ఛైర్మ‌న్ ఫ‌రూక్- అఖిల మ‌ధ్య కొత్త‌గా గొడ‌వ మొద‌లైంది. అదికూడా క‌బ్జా చేసిన భూముల విష‌యంగా కావ‌టం విచిత్రంగా ఉంది. నంద్యాల‌లో వ‌క్ఫ్ బోర్డుకు సుమారు 55 ఎక‌రాల స్ధ‌ల‌ముంది. అందులో స‌గానికిపైగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైందని తేలింది. ఆక్ర‌మ‌ణ‌దారులంతా భూమా వ‌ర్గ‌మేన‌ట‌. క‌బ్జాల‌ నుండి భూమిని విడిపించాలంటూ స్ధానిక ముస్లింలు ఫ‌రూక్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ముస్లింలు, అటు భూమా వ‌ర్గం. దాంతో ఏం చేయాలో పాలుపోక పంచాయితీని చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ళారు. కొంద‌రిపై స్ధానికంగా ఫిర్యాదు కూడా చేశారు. దాంతో అఖిల వ‌ర్గం ఫ‌రూక్ పై భ‌గ్గుమంటోంది.  ఎన్నిక‌ల‌కు ముందు మొద‌లైన  ఈ కొత్త పంచాయితీని చంద్ర‌బాబు ఏ విధంగా ప‌రిష్క‌రిస్తారో చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: