తెలుగుదేశంపార్టీ ఏది చేసినా అతిగానే చేస్తుంది. మీడియాను అడ్డుపెట్టుకుని ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూంటుంది. ప్రత్యర్ధులపై విరుచుకుపడటమైనా, తమ అసమర్ధతను, తప్పులను కప్పిపుచ్చుకునేందుకైనా మీడియా మద్దతు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటుంది. ఇదంతా ఇపుడెందుకంటే, మంత్రి నారాయణతో పాటు టిడిపికి మద్దతుగా ఉండే పలు సంస్ధల యాజమాన్యాల కార్యాలయాలపై ఐటి దాడులు జరిగాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే, తన కార్యాలయాలపై ఐటి దాడులు జరగలేదని స్వయంగా నారాయణే చెప్పినా ఏ మీడియా కూడా పట్టించుకోలేదు. మంత్రి కార్యాలయాలపై దాడులు జరిగినట్లు పదే పదే బ్రేకింగ్ న్యూస్ అంటూ ఊదరగొట్టేసింది.

ఇక, మిగిలిన విషయాలను చూస్తే పలువురు రియాల్టర్లు, నిర్మాణ కంపెనీలు తదితర రంగాల్లోని వారిపై ఐటి దాడులు జరగిన మాట మాత్రం వాస్తవం. మంత్రి కార్యాలయాల మీద కానీ లేకపోతే టిడిపి నేతల కార్యాలయాలపైన కానీ ఐటి దాడులు జరిగినట్లు కనబడలేదు. మరి చంద్రబాబు దగ్గర నుండి మంత్రులు, నేతలు ఐటి దాడుల విషయంలో ఎందుకంత రెచ్చిపోతున్నారు ?

 నాలుగున్నరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక సామాజికవర్గం ప్రయోజనాల కోసమే చంద్రబాబు పాలన చేస్తున్నారన్న ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయ్. అవి ఆరోపణలు కావని అన్నీ నిజాలే అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని ప్రతిపక్షాలంటున్నాయి. రాజధాని కేంద్రంగా పలువురు టిడిపి నేతలు భారీగా పెట్టుబడులు పెట్టారట. నేరుగా తాము రంగంలోకి దిగితే ఇబ్బందులు ఎదురవుతాయని తెరవెనుక నుండే అంతా నడిపిస్తున్నారు. కాకపోతె తెరమీద ఇంకెవరో కనిపిస్తుంటారు.

సమస్యంతా ఇపుడు అక్కడే మొదలైంది. శుక్రవారం ఉదయం నుండి తెరమీద కనిపించే వారిలో కొందరిపైనే ఇపుడు ఐటి అధికారులు దాడులు చేశారట. దాడుల్లో తెరమందున్న వాళ్ళు ఇరుక్కుంటే ఇంతకాలం తెరవెనుకున్న తాము కూడా ఇరుక్కుంటామన్న భయంతోనే టిడిపి నేతలు ఐటి దాడులపై రెచ్చిపోయి మాట్లాడుతున్నట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

 చంద్రబాబు కూడా సగటు నేతలు మాట్లడినట్లు మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది. ఎవరిపైనో ఐటి దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నారు ? జరుగుతున్న ఐటి దాడులన్నీ కుట్రలో భాగమే అని చంద్రబాబు తీర్మానించేశారు. టిడిపిపై ప్రధానమంత్రి నరేంద్రమోడి కక్షకట్టినట్లు వ్యవహరిస్తున్నారని అనటానికి తాజా దాడులే నిదర్శమని చంద్రబాబు అనటమే విచిత్రంగా ఉంది. సరే, ఇక్కడే అందరిలోనూ ఒక సందేహం వస్తోంది.

టిడిపి అంటే మొదటి నుండి చాలా ఓవర్ చేస్తుందన్న విషయం తెలిసిందే. అదే సమయంలో మీడియా కూడా ఎందుకు అతి చేస్తోంది ?  దాడులు చేసినట్లు ఐటి అధికారులు చెప్పలేదు, జరగలేదని మంత్రి స్పష్టంగా చెబుతున్నారు. మరి మధ్యలో మీడియాకు ఎందుకు నొప్పి ? అతి సర్వత్రా వర్జయేత్..అన్న విషయం టిడిపి మద్దతు మరచిపోయిందేమో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: