కుండ‌డు పాల‌ను కూడా ఒక్క ఉప్పుగ‌ల్లు నాశ‌నం చేసిన‌ట్టుగా తాను చెడిపోయిందే కాకుండా బ‌లంగా ఉన్న స్థానాల్లోనూ టీడీపీని నాశ‌నం చేస్తున్నారు క‌ర‌ణం బ‌లరామ కృష్ణ‌మూర్తి. టీడీపీలో సీనియ‌ర్ మోస్ట్ అని పేరు తెచ్చుకున్న ఆయ‌న  గత కొంత కాలంగా కొన్ని విషయాల్లో అర్థం పర్థం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న త‌న మేధావి త‌నాన్ని వినియోగించి పార్టీని అబివృద్దిలోకి తీసుకురావాల్సిందిపోయి.. పార్టీని నాశనం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న నాయ‌కుడిలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో త‌న మాటే అంద‌రూ వినాల‌ని, త‌న మాటే చెల్లుబాటు కావాల‌ని పంతం ప‌ట్టిన క‌ర‌ణం బ‌ల‌రాం.. టీడీపీ అభివృద్దికి కాకుండా పార్టీ నాశ‌నానికి కృషి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 


ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు అద్దంకి నుంచి పోటీచేసి ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే, ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున గెలుపొందిన గొట్టిపాటి ర‌వి త‌ర్వాత కాలంలో చంద్ర‌బాబు చెంత‌కు చేరిపోయారు. అయితే, త‌న‌కు, గొట్టిపాటి వ‌ర్గానికి మ‌ధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయ‌ని, ర‌విని పార్టీలోకి చేర్చుకోవ‌ద్ద‌ని క‌ర‌ణం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, పార్టీ బ‌లోపేత‌మే ముఖ్య‌మ‌ని, అప్పుడే అంద‌రం బాగుంటామ‌ని చెప్పిన చంద్ర‌బాబు ఈ విజ్ఞ‌ప్తిని ప‌క్క‌న పెట్టారు. దీంతో క‌ర‌ణం .. పార్టీపై ప‌గ బ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 


పార్టీ బ‌లంగా ఉన్న కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెట్టారు. ఇక్క‌డ స‌జావుగా సాగుతున్న టీడీపీ రాజ‌కీయాల‌ను క‌లుషితం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌కు వ్య‌తిరేకంగా క‌ర‌ణం పావులు క‌దుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే దామ‌చ‌ర్ల కుటుంబంలోని ఆయ‌న చిన్నాన్న కుమారుడు దామ‌చ‌ర్ల స‌త్య‌కు మ‌ద్దతుగా ఉంటూ.. జ‌నార్ద‌న్‌కు వ్య‌తిరేకంగా కార్య‌కలాపాల నిర్వ‌హ‌ణ‌ను క‌ర‌ణం ప్రోత్స‌హిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎమ్మెల్యే డోలాను కూడా క‌ర‌ణం త‌న‌వైపున‌కు తిప్పుకొని.. దామ‌చ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా ప‌నులు చేసేలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. 


దీంతో కొండ‌పిలో టీడీపీ రెండుగా చీలిపోయింది. ప్రధానంగా ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గం దామచర్ల సత్యతో పాటు ఎమ్మెల్యే స్వామికి మద్దతు పలుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ జిల్లా నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒక్కోవర్గం ఒక్కొక్కరికి మద్దతు పలుకుతుండడంతో కొండపి టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. మ‌రి  ఈ విష‌యంలో ప్ర‌ధాన పాత్ర‌ధారి అనే పేరున్న క‌ర‌ణంపై చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకుంటే ఇక్క‌డ ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు కొంత వ‌ర‌కైనా తెర‌ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: