ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటాల వల్ల తనను కొందరు టార్గెట్ చేసుకున్నట్లు మంగళగిరి వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తనకున్న భద్రతను రెట్టింపు చేయాలంటూ ఆళ్ళ స్వయంగా ఈరోజు డిజిపి ఆర్పీ ఠాకూర్ ను కలవటంపై పార్టీలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న చంద్రబాబునాయుడుపై  తాను అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న విషయాన్ని ఎంఎల్ఏ గుర్తుచేశారు. బెదిరిస్తూ, ఫోన్లు చేస్తు అనేకమంది తనను ఇబ్బంది పెడుతున్నట్లు ఆళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖలను స్ధానికి పోలీసు స్టేషన్లలో కూడా అందించినట్లు ఎంఎల్ఏ చెబుతున్నారు. అందుకే తనకు భద్రత పెంచాలని అడిగినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ, ఓటుకునోటు, సదావర్తి భూముల వేలం తదితర  అంశాలపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆళ్ళ వివిధ కోర్టులో పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కేసుల్లో కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం, స్టేలు ఇవ్వటంతో సహజంగానే ఆళ్ళపై ప్రభుత్వంతో పాటు అధికార పార్టీలో చాలామందికి మండుతోంది.  బహుశా అందుకే ఎంఎల్ఏకు వ్యతిరేకంగా ఫోన్లు, బెదిరింపు లేఖలు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. ఇంకోవైపు ఆళ్ళకు బెదిరింపులూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆళ్ళ ఈరోజు డిజిపిని కలవటం పార్టీలో కలకలం రేగుతోంది.  తనకు ప్రస్తుతం ఉన్న ఇద్దరు గన్ మెన్ల భద్రతను నాలుగుకి పెంచాలని ఆళ్ళ డిజిపిని కలిశారు. అయితే, ప్రతిపక్ష ఎంఎల్ఏలకు, పర్టిక్యులర్ గా ఆళ్ళ లాంటి వాళ్ళకు భద్రతను పెంచటమన్నది డిజిపి చేతుల్లో లేదన్న విషయ అందరికీ తెలిసిందే. కాబట్టి ఆళ్ళ భద్రతపై డిజిపి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోవటం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: