భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ పై విరుచుకుపడ్డారు. ఈరోజు బిజెపి ఎన్నికల సన్నాహక సమావేశంలో షా మాట్లాడుతూ, కెసియార్ ఆటలు సాగనివ్వమంటూ గట్టిగా హెచ్చరించారు. కెసియార్ ఇవ్వాలని అనుకుంటున్న మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని చెప్పారు. అసలు కెసియార్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళారో చెప్పాలంటూ నిలదీశారు. విచిత్రమేమిటంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటీ తర్వాత కెసియార్ అసెంబ్లీని రద్దు చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా  మాత్రం ముందస్తు ఎన్నికలకు కారణాలేంటని కెసియార్ ను అమాయకంగా అడగటం విడ్డూరంగా ఉంది.

 

లోక్ సభ ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోడి హవాలో కొట్టుకుని పోతామన్న భయంతోనూ కెసియార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లు షా ఆరోపించారు. తన కొడుకునో లేదా కూతురినో ముఖ్యమంత్రిని చేయాలన్న కెసియార్ ఆశలు నెరవేరవంటూ హెచ్చరించారు. ముందస్తు ఎన్నికల భారానికి కెసియార్ ఏమని సమాధానం చెబుతారంటూ నిలదీయటం విచిత్రంగా ఉంది.

 

సిఎం చెబుతున్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లతో బిసిలు అన్యాయమైపోతారట. బిసిలకు అన్యాయం జరుగుతోంది కాబట్టే ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకుంటామని వివరణ కూడా ఇచ్చారు లేండి. తెలంగాణాపై వివక్ష చూపుతున్నట్లు కెసియార్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేశారు. నాలుగున్నరేళ్ళల్లో తెలంగాణాకు కేంద్రం 1.15 లక్షల కోట్లు మంజూరు చేయటం  వాస్తవం కాదా అంటూ నిలదీశారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: