వంగ‌వీటి రాధాకృష్ణ‌. బెజ‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి పేరు తెలియ‌నివారు ఉండ‌రు. అస‌లామాట‌కొస్తే.. ఏపీ రాజ‌కీయాల గురించి మాట్లాడుకుంటే.. వంగ‌వీటి కుటుంబాన్ని ప‌క్క‌న పెట్ట‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌ప్పుడు వంగ‌వీటి రంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. ఇక‌, ఆ ఫ్యామిలీ నుంచి రంగా త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు రాధా కృష్ణ రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. కాంగ్రెస్ హ‌యాంలో ఆయ‌న వైఎస్‌కు అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. 2004 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే, ఆ త‌దుప‌రి ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి ఆయ‌న చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యంలోకి చేరిపోవ‌డంతో కాంగ్రెస్ ఆయ‌న‌ను దూరం పెట్టింది. అయితే, అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత చిరంజీవి త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. ఆయ‌న మాత్రం దూరంగా ఉండిపోయారు. 


ఇక‌, వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలో చేరారు. 2014లో ఆయ‌న ఆయ‌న పోటీ చేసి వ‌రుస ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఆయ‌న అటు రాజ‌కీయం గా, ఇటు ఆర్థికంగా కూడా చాలా న‌లిగిపోతున్నారు.ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉండ‌డంతో ఆయ‌న త‌న‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం బెజ‌వాడ‌ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో త‌న గెలుపు ఓట‌ములపై అంచ‌నా కూడా వేసుకున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా.. తాను కూడా ఒకే సామాజిక వ‌ర్గానికి చెంది ఉండ‌డం, బొండా ఉమాపై తీవ్ర అవినీతి, భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో త‌న‌కు అనుకూలంగా ఇక్క‌డ రాజ‌కీయాలు ఉంటాయ‌ని రాధా భావిస్తున్నారు. త‌న గెలుపు ఖాయ‌మ‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. 


ఈ నేప‌థ్యంలోనే గ‌డిచిన నాలుగేళ్లుగా ఆయ‌న ఇక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు. అయితే,అనూహ్యంగా ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరిన మ‌ల్లాది విష్ణు రాధాకు అడ్డు త‌గిలారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ హామీతో ఆయ‌న విజ‌య‌వాడ కాంగ్రెస్ అధ్య‌క్షుడి ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. దీంతో ఇప్పుడు ఈ టికెట్ మ‌ల్లాదికి కేటాయించారు. ఈ క్ర‌మంలోనే వంగ‌వీటి అనుచ‌రులు విజ‌య‌వాడ‌లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే, రాధాను బుజ్జ‌గించేందుకు రంగంలోకి దిగిన వైసీపీ నాయ‌క‌త్వం.. ఆయ‌న‌కు సెంట్ర‌ల్ సీటు ఇవ్వ‌లేమ‌ని క‌రాఖండీగా చెప్ప‌డంతోపాటు మూడు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. గతంలో రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున అక్కడి నుంచి పోటీ చేస్తానంటే అభ్యంతరం లేదని, అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ, అలాగే కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలు కూడా రాధాకు అనుకూలంగా ఉంటాయని పార్టీ సూచించినట్లు తెలిసింది. 


దీనిపై అధ్య‌య‌నం చేసిన రాధా వ‌ర్గం.. ఎంపీగా వెళ్లే ఆలోచ‌న‌ను ప‌క్క‌కు పెట్టింది. అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ‌ తూర్పులో క‌మ్మ వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డం, టీడీపీ సానుభూతి ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డం, సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌కు అనుకూల ప‌వ‌నాలు వీస్తుండ‌డంతో ఇక్క‌డ కూడా పోటీకి సిద్ధంగా ఉండే ప‌రిస్థితి లేద‌ని తెలిసింది. ఇక‌, మిగిలిన అవ‌నిగ‌డ్డ ఒక్క‌టే రాధాకు ఒకింత అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన మండ‌లి బుద్ద‌ప్ర‌సాద్‌.. ప్ర‌స్తుతం డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్నారు. ఈయ‌న పెద్ద‌గా నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం లేదు. పైగా ఇక్క‌డ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు డామినేష‌న్ ఎక్కువ‌గా ఉండ‌డంతో మండ‌లి ఆయ‌న తెర‌చాటుగా త‌గువులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీలో ఉన్న చిచ్చు త‌న‌కు అనుకూలంగా మార‌డంతోపాటు కాపు వ‌ర్గం కూడా ఎక్కువ‌గా ఉండ‌డం త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని రాధా భావిస్తున్నార‌ని స‌మాచారం. దీంతో అవ‌నిగ‌డ్డ‌ను ఎంచుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. లేకుంటే ఈలోపు జ‌న‌సేన నుంచి పిలుపు వ‌స్తే.. మాత్రం ఆ పార్టీలో చేరి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ అభ్య‌ర్థిగానే నామినేష‌న్ వేయొచ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: