తెలంగాణ రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీఓలు గత 24 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు పోలీసులు ఎట్టకేలకు అనుమతించి 19 షరతులు విధించారు. ఇందులో ఏ షరతు తప్పినా నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటామని, ఏ సమయంలోనయిన సభకు అనుమతులు రద్దు చేస్తామని తెలిపారు.
అయితే ఇక్కడే అసలు ఇబ్బంది ఉంది. సెప్టెంబరు మొదటి వారాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ ముల్కీఅమరవీరుల స్మారక వారంగా ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో సమైక్య సభను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి సభకు అనుమతిస్తే మా శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని వారు పోలీసులకు ధరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు ర్యాలీలు నిషేధం అని చెప్పి వారికి అనుమతివ్వడం లేదు. ఇక దానికి ముందురోజు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ యుద్దభేరి పేరుతో సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. 
తెలంగాణ వాదులకు, ఎమ్మార్పీఎస్ కు అనుమతివ్వని పోలీసులు సమైక్యసభకు అనుమతిచ్చారని, ప్రభుత్వం వెనకుండి సభ నిర్వహిస్తున్నట్లు అర్ధమవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహిస్తామని..సభను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు, విద్యార్థులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మంద కృష్ణ కూడా హైదరాబాద్ లో సమైక్యసభ దురాక్రమణ అని, ఇక్కడ సభకు అనుమతి ఇవ్వాల్సింది డీజీపీ, ముఖ్యమంత్రి, ప్రభుత్వం కాదని ఎమ్మార్పీఎస్ అనుమతి ఇస్తేనే సభ జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ లో ఈ నెల 7న హైదరాబాద్ లో ఏవయినా దాడులు జరిగితే ఎవరు భాద్యులన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి తోడు సభకు 15 వేల మంది ఉద్యోగులు హాజరుకావాలని పోలీసులు చెబుతుండగా, 50 వేల మందికి పైగా వస్తారని, ఏపీ ఎన్జీఓ అమ్మిన టికెట్ ప్రవేశానికి అర్హత పత్రమని ఏపీఎన్జీఓలు చెబుతున్నారు. సున్నితమయిన సమస్య మీద రెండు ప్రాంతాలు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: